పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ప్రభుత్వ వైన్ షాప్ లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆ పాప్ లో ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన మద్యం అమ్మకాలు, అందుకు సంబంధించిన బిల్లుల గురించి ఆరా తీశారు. లక్షల రూపాయల మద్యం అమ్మి కేవలం రూ.7 వేలకి మాత్రమే బిల్లు ఇచ్చినట్లు గుర్తించామని బీజేపీ అధ్యక్షురాలు తెలిపారు. ఇలా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా, కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నట్లు ఆరోపించారు. మద్యం దుకాణం నుండి మందు బాటిళ్లు తీసుకుని రోడ్డుపై పగలగొట్టి నిరసన తెలిపారు పురందేశ్వరి.


ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగి అస్వస్థతకు గురై స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నవారిని పురందేశ్వరి పరామర్శించారు. రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ దుకాణాల్లో కల్తీ మద్యం అమ్మకాలపై పోరాటం చేస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా కూడా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మీనమేషాలు లెక్క వేస్తున్నారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నకిలీ మద్యం సరఫరా చేస్తున్న సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ దుకాణం వద్ద ఆందోళన నిర్వహించారు. గుర్ర బల్ల సెంటర్ లోని మద్యం దుకాణాన్ని సందర్శించి అమ్మక వివరాలపై ఆరా తీశారు. లక్ష రూపాయలు అమ్మి 7 వేల రూపాయలకే బిల్లు ఇవ్వడంపై పురందేశ్వరి విస్మయం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జగన్‌రెడ్డి పూర్తి నిషేధం విధిస్తామని చెప్పి ఇప్పుడు తుంగలో తొక్కారని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా పురంధేశ్వరి మాట్లాడుతూ.. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.