Konaseema District: బైక్ పార్కింగ్ చేసి షాపింగ్‌కు వెళ్లిన దంపతులు తిరిగి వచ్చేసరికి లేదు. ఓడల రేవు బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్స్ బైక్ కూడా ఇలానే పోయింది. అక్కడ ఇక్కడ అని కాదు... అంబేడ్కర్ కోనసీమజిల్లాలో పదుల సంఖ్యలో బైక్‌లు దొంగతనాలు సంచలనంగా మారుతున్నాయి. ఇది జనాలతోపాటు పోలీసులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వచ్చింది పోలీసులకు. మొత్తానికి దీని వెనుక ఓ ముఠా ఉన్నట్టు గుర్తించారు. తాళం వేసి ఉన్న బైక్‌లే లక్ష్యంగా వరుస చోరీలకు పాల్పడుతున్న్టటు తేల్చారు. వారిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇక్కడే పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజీల ద్వారా దర్యాప్తు చేపట్టారు. బైక్ దొంగతనాల తీగ లాగి మరింత లోతుల్లోకి వెళ్లేసరికి గంజాయి మూలాల డొంక కదులుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుల వ్యవహారంలో అనేక కోణాల్లో విచారణ వేగవంతం చేసిన అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్‌కుమార్ దూకుడుతో ఇప్పటికే అనేక బైక్ దొంగతనాలకు సంబంధించి గుట్లన్నీ పట్టుకున్నారు.
పోలీసులకు చిక్కిన వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జిల్లాలోని ముఖ్యంగా యువతను నేరప్రవృత్తి వైపు లాగుతోన్న గంజాయి సప్లై ముఠాను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు బైక్ దొంగతనాలు, ఇటు గంజాయి బ్యాచ్‌ను గుర్తించిన పోలీసులు మొత్తం మీద అసలైన తీగను పట్టుకుని విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో గంజాయి మాఫియా గుట్టు రట్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
Also Read: పచ్చగడ్డి వేస్తే భగ్గు! రాజానగరంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
గంజాయి బ్యాచ్‌ను గుర్తించిందిలా..
బైక్ దొంకతనాలపై దృష్టిసారించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా ఓ దొంగల ముఠాను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని విచారస్తున్న క్రమంలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంను గంజాయి బ్యాచ్ టార్గెట్ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అమలాపురం పట్టణ శివారు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఈ విక్రయాలు జరుపుతున్నారు. యూత్‌ను టార్గెట్ చేసుకుని విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఈదరపల్లి నుంచి నల్లవంతెన వరకు బైపాస్ రోడ్డు, కామనగరువు పంచాయతీ పరిధిలోని నిర్జన ప్రాంతాలు, ఏరియా ఆసుపత్రి వెనుక శిథిల భవనం, ఇందుపల్లి రోడ్డు మార్గంలోని ఖాళీ లేఅవుట్లు, బోడసకుర్రు నుంచి భట్నవిల్లి వరకు హైవే మార్గం ఈ దందాకు సెంటర్‌గా ఉన్నాయి. ఇలా అనేక చోట్ల గంజాయి బ్యాచ్ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు ఇటీవల పెరుగుతోన్న నేరాలకు మూలాలు ఈ గంజాయి బ్యాచ్ అనే సమాచారాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
గంజాయి డొంక కదిలిందిలా..
కోనసీమ జిల్లాలో వరుస బైక్‌ల దొంగతనాలపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని కేసును ఛేదించారు. వారిని విచారించడంతో గంజాయి విక్రయ మూలాల గుట్టు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అమలాపురం కేంద్రంగా ముఠా కార్యకలాపాల డొంక కదులుతోంది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు... ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని తెచ్చి విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: జనసేనలో ఏం జరుగుతోంది? కేడర్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది?