Rajangaram MLA batthula verses ex MLA Jakkampudi | తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో రాజకీయ రచ్చ రేగుతోంది.. ఎమ్మెల్యే వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యేల చుట్టూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది.. సంక్రాంతి సంబరాలు సందర్భంగా రాజుకున్న నిప్పు నేటికీ దావానంలా వ్యాపిస్తూనే ఉంది.. వేదిక అది ఇది అని లేదు.. అక్కడ ఇక్కడ అనే ఊసే లేదు.. ఎనీ సెంటర్‌, ఎనీ ప్లేస్‌ అంటూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా లు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.. మొత్తం మీద ఇక్కడ వైసీపీ జనసేన అనే ఊసే లేకుండా పార్టీలను సైతం పక్కనపెట్టి వ్యక్తిగతంగా మాటల యుద్ధం జరుగుతున్నట్లు అనిపించేలా రాజకీయ రగడ అయితే జరుగుతోంది..


పదికోట్లు వరకు నొక్కేశారన్న మాజీ ఎమ్మెల్యే...


సంక్రాంతి సంబరాలు అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలోని పందేల నిర్వాహకుల నుంచి పది కోట్లు రూపాయలు వరకు ఎమ్మెల్యే నొక్కేశారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. నియోజకవర్గంలో ఒక్కో బరికి రూ.10 లక్షల చొప్పున నిర్వాహకుల వద్దనుంచి ముక్కుపిండి మరీ వసూళ్లుకు పాల్పడి మొత్తం 10 కోట్లు రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపించారు. ఇలాగే నియోజకవర్గంలో ప్రతీ పనికి ఇంత రేటు అని ఫిక్స్‌ చేసి అడ్డగోలుగా దోచేస్తున్నారని రాజా తీవ్ర ఆరోపణలుచేశారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఓ సభలో కూడా మాజీ ఎమ్మెల్యే రాజా సోదరుడు గణేష్‌కూడా తీవ్రంగా విమర్శలుచేశారు.. దమ్ముంటే తమపై కేసులు పెట్టాలని సవాలు విసిరారు. 


మాజీ ఎమ్మెల్యే, అతని సోదరునిపై ఎమ్మెల్యే ఆగ్రహం..


మీ వైసీపీ అయిదేళ్ల అరాచక పాలనలో అన్నదమ్ములిద్దరూ దోచుకుంది నియోకవర్గ ప్రజలకు తెలుసంటూ కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే బత్తుల మలరామకృష్ణుడు. రాజానగరం నియోజకవర్గంలో మీరు దోచుకోలేనిదంటూ ఏదీ లేదని, పైగా రాజమండ్రిలో అరాచక శక్తులను పెంచి పోషిస్తూ శాంతి భద్రతలకు విఘాతం సృష్టించారని మండిపడ్డారు. మీరు అధికారంలో ఉన్న అరాచకాలకు విసుగెత్తినందు వల్లనే ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టారని విమర్శించారు. మొత్తం మీద రాజానగరం కేంద్రంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాత్రం మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకోగా వేదిక ఏదైనా ఒకరిపై ఒకరు మాత్రం విమర్శల పరంపర అయితే కొనసాగిస్తున్నారు..