Modi Speech in Rajamahendravaram: వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉందని.. అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీలో వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్ద మద్యం సిండికేట్ నడుస్తోందని మోదీ అన్నారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం మోసం చేసిందని.. ఇన్నేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు. అంతలోనే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిందని మోదీ ఆరోపించారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ వైసీపీ ప్రభుత్వానికి చేతకాదని ప్రధాని అన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలో జరిగిన కూటమి బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీని శాలువా కప్పి సన్మానించిన పవన్ కళ్యాణ్.. ప్రధానికి పాదాభివందనం చేశారు. అలా చేయవద్దని పవన్ కు మోదీ సూచించారు. అంతకుముందు మోదీని సన్మానించిన టీడీపీ నేత లోకేశ్.. ఆయనకు వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.


అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. అయినా వైసీపీ ప్రభుత్వం పోలవరం పనులు పూర్తి చేయలేదు. ఇప్పుడు రైతులు నీళ్ల కోసం తిప్పలు పడుతున్నారు. పంటకు సరైన మద్దతు ధర కూడా దొరకడం లేదు’’ అని మోదీ అన్నారు. జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని సమస్యలను దూరం చేస్తామని హామీ ఇచ్చారు. 


కాంగ్రెస్, I.N.D.I.A కూటమి నేతలు తరచూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంటూ గగ్గోలు పడుతుండడానికి కారణం వారు చేసిన అనేక కుంభకోణాలే అని అన్నారు. ఝార్ఖండ్‌లో ఈడీ తాజాగా ఒక కాంగ్రెస్ మంత్రి ఇంట్లో డబ్బుల కొండను గుర్తించిందని మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఇంట్లోనే ఎందుకు ఇంత అవినీతి ధనం లభిస్తున్నాయో ఆలోచించండి. కాంగ్రెస్ రాకుమారుడి నుంచి ఈ జాతి నుంచి జవాబును ఆశిస్తోందని మోదీ అన్నారు. దేశం రీఫార్స్, పర్ఫామ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే సూత్రంపై ముందుకు పోతోందని మోదీ అన్నారు. ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. అందరూ ఎన్డీఏ వైపు నిలబడాలని పిలుపు ఇచ్చారు. 


ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు
‘‘నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజమహేంద్రవరం వాసులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. నేను గోదావరి తల్లికి నమస్కరిస్తున్నాను. నేను ఒడిశా నుంచి వస్తున్నాను. అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అన్ని చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ముందే తిరస్కరించారు. ఇక్కడ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కూడా గత ఐదేళ్లలో ప్రగతిని కుంటుపడేలా చేసింది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. డెవలప్‌మెంట్ లో రాష్ట్రం టాప్ లో ఉండేది. విభజన తర్వాత వైసీపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టింది’’ అని ప్రధాని మాట్లాడారు.


ఎన్టీఆర్ వల్లే ఆ రూపం ప్రజల్లోకి
ఎన్టీఆర్ రామచంద్రుడి పాత్రను సినిమాల్లో పదే పదే ధరించి ఆ రూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఇటు బీజేపీ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించగలిగింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని బహిష్కరించింది. ఈసారి ఏపీకి మోదీ గ్యారంటీ ఉంది.. చంద్రబాబు నాయకత్వమూ ఉంది. ఇంకా పవన్ కల్యాణ్ విశ్వాసమూ ఉంది. రాజమండ్రి నుంచి డి. పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఏలూరు నుంచి పుట్టా మహేశ్ యాదవ్, అమలాపురం నుంచి గంటి హరీశ్ మాధుర్ ను ఎంపీ అభ్యర్థులుగా గెలిపించండి. వీరికి భారీ మెజారిటీ గెలిపించండి. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కూడా గెలిపించి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులుపెట్టేలా ఆశీర్వదించండి’’ అని ప్రధాని మోదీ ప్రసంగించారు.