Andhra Pradesh News: జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మరోసారి మాట తూటాలు పేలుతున్నాయి. జనసేనలో జాయిన్ అవ్వడానికి వచ్చిన ముద్రగడ కుమార్తెను వారించిన పవన్ కల్యాణ్... తండ్రి అంగీకారంతోనే పార్టీలోకి రావాలని తేల్చి చెప్పేశారు. దీనికి వైసీపీ నేత ముద్రగడ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పనిలో పనిగా వివాదంలోకి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని లాగారు.
తనను రోడ్డుపైకి లాగింది పవన్ కల్యాణే అన్నారు ముద్రగడ. ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా రోడ్డుకు ఇడ్చేశారని విమర్శించారు. లక్ష పుస్తకాలు చదివింది ఇందుకేనా అని ప్రశ్నించారు. తన కుమార్తెను ప్రజలకు పరిచయం చేసిన పవన్ కల్యాణ్ ఆయన భార్యలను కూడా పరిచయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల్లోకి తీసుకురావాలన్నారు.
ఇకపై కుమార్తెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ముద్రగడ. ఆమె తనకు నచ్చినట్టు ప్రచారం చేసుకోవచ్చని... జనసేన మీటింగ్స్‌కు వెళ్లొచ్చని... డిబేట్లలో కూడా పాల్గొనవచ్చని సలహా ఇచ్చారు. సినిమాల్లో నటించాల్సిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో నటిస్తున్నారని అంత అవసరం లేదని ఎద్దేవా చేశారు. తాను ఎప్పుడూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయలేదని అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆయనేనన్నారు.
చంద్రబాబు వద్ద పవన్ కల్యాణ్ మేనేజర్‌గా మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నారని విమర్శలు చేశారు ముద్రగడ. ఆయన చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వచ్చి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని అన్నారు. ఇకపై తన కుమార్తెతో తనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని... తాను ఇప్పుడు చాలా రిలీఫ్‌గా ఉన్నానని అన్నారు.