Kakinada Latest News: కాకినాడలో ఒక టాబ్లెట్ కొనుక్కుందామని బయటకు వెళితే దాదాపు అన్ని మెడికల్ షాపులు షట్టర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదేంటి.. మెడికల్ షాపులవాళ్లంతా బంద్ చేస్తున్నారా.. అని కూపీ లాగితే అసలు విషయం తెలిసింది.. ఆపరేషన్ గరుడ పేరుతో అధికారులు తనిఖీలు చేస్తున్నారని, తప్పు చేయకపోతే భయమెందుకు దర్జాగా తెరిచే ఉంచుతారు కదా. ఇది సగటు వినియోగదారుడి ప్రశ్న. ఏపీ వ్యాప్తంగా అధికారుల బృందం ఏకకాలంలో ఆపరేషన్ గరుడ పేరుతో చేపట్టిన తనిఖీల్లో మెడికల్ షాపుల మాయాజాలం బట్టబయలైంది. దొరికినవాడు దొంగ.. లేకపోయినా దొంగే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టిన అధికారుల చర్యలతో ఓ పక్క తనఖీలు చేస్తున్న మెడికల్ షాపుల్లో బోలెడు అక్రమాలు వెలుగు చూస్తే.. సమీపంలో ఉన్న దుకాణాల షట్టర్లు క్లోజ్ చేసి పలాయనం చిత్తగించారు మిగిలిన దుకాణ దారులు.
మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల్లో విచ్చలవిడిగా మత్తు ఇంజక్షన్లు, ఎటువంటి ప్రిష్కిప్షన్ లేకపోయినా మందులు ఇవ్వడం, ఇంకా నిషేధిత మందులు అమ్మకాలపై చర్యల్లో భాగంగా ఏపీలో పెద్దఎత్తున దాడులు నిర్వహించారు అధికారులు. ఏపీ ఆపరేషన్ గరుడ పేరుతో డీజీపీ ఆదేశాల మేరకు ఈగల్ టీమ్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, లోకల్ పోలీసులు, డ్రగ్ కంట్రోల్ టీమ్ బృందంగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సోదాలు చేసి పలు మెడికల్ షాపుల్లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లో ఈ దాడులు ఏకకాలంలో చేపట్టారు. రాజమండ్రిలో మత్తుమందు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలు జిల్లాల్లో నిషేదిక మందులు అధికారులకు లభ్యం అయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు..
షట్టర్లు దించి నిర్వాహకులు పరార్..
ఆపరేషన్ గరుడ పేరుతో మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారులు దాడులతోమెడికల్ షాపుల నిర్వాహకులు షట్టర్లు దించి పరారయ్యారు. టాబ్లెట్ కొందామంటే ఎక్కడా దొరకని పరిస్థితితలెత్తింది. అయితే మెడికల్ షాపులు మూసివేయడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏ తప్పులేకుంటే ఇలా ఎందుకు మూసి పారిపోతారని ప్రశ్నించారు. అధికారులు మరొక్కసారి అకస్మాత్తుగా దాడులు చేయాలని ప్రజలు సూచిస్తున్నారు. చాలా మెడికల్ షాపుల్లో నకిలీ మందులు, మత్తు ఇంజక్షన్లు విక్రయాలు చేపడుతున్నారని చెబుతున్నారు. అధిక ధరలకు మందులు విక్రయించడం, డాక్టరు చీటీ లేకుండా మందులు ఇస్తున్నారని వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.