Odalarevu ONGC Issue : ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ వద్ద ఆ గ్రామస్థులు చేపట్టిన నిరసన రెండు నెలలుగా కొనసాగుతోంది. గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఓఎన్జీసీ మోసం చేసిందంటూ స్థానికులు నిరసన బాట పట్టారు. అయితే వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జీస్తోన్న ఓఎన్జీసీ వద్ద ఇంత తంతు జరుగుతున్నా ఆ సంస్థ యాజమాన్యం కానీ, ప్రజాప్రతినిధులైనా పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఓఎన్జీసీ ముందు గ్రామస్తులు పెట్టిన డిమాండ్ల సాధనకు జరిగిన చర్చలు సఫలం కాకపోవడానికి కారణమేంటి.  

Continues below advertisement


నిరసన బాట పట్టింది ఇందుకే..
దేశంలో ఉన్న ఓఎన్జీసీ ఆన్‌షోర్‌ టెర్మినల్స్‌లో ఓడలరేవు కూడా భారీ స్థాయిలోనే ఉత్పత్తిని సాధిస్తోన్న క్షేత్రం. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 20 లక్షల క్యూబిక్‌ మీటర్లు మేరకుపైగా గ్యాస్‌, ఆయిల్‌నిక్షేపాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈక్రమంలోనే టెర్మనల్‌ అభివృద్ధితోపాటు ఆఫ్‌షోర్‌లో కొత్తగా ఉత్పత్తి సాధించిన నాలుగు సబ్‌ సీ వెల్స్‌ కూడా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న క్రమంలో కొత్తగా ప్రోమోటెక్‌ కాంట్రాక్టు దక్కించుకుంది. దీంట్లో తొలుత 66 పోస్టుల భర్తీ చేసేందుకు సంస్థ ముందుకు రాగా గ్రామస్థులకు 30 పోస్టుల వరకు ఇచ్చి ఆపై నియోజకవర్గంలో మరో 36 పోస్టులు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే కేవలం 18 పోస్టులతో సరిపెట్టిన సంస్థ మిగిలిన పోస్టులు వేరేగా భర్తీచేసుకుంది. దీంతో గ్రామస్థులు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరసనబాట పట్టారు. ఈ జాబితా తుది రూపకల్పన అంతా నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచే సదరు సంస్థ ప్రతినిధులకు చేరగా ఉద్యోగాలు మాత్రం గ్రామంలోని 18 మందికే దక్కాయి. ఇందులోనూ జాబితాలో లేనివారికి దక్కడం, మిగిలిన పోస్టుల్లో ఇతర ప్రాంతాల వారికి దక్కడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో గ్రామస్తులు ఓఎన్జీసీ క్షేత్రం ముందు నిరసన బాట పట్టారు. 


స్వప్రయోజనాల కోసమే సాగదీతకు కారణమా..?
రాజకీయ నేతలు అనేక ప్రయోజనాలు ఆశించే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులకు ఉద్యోగాలు అని చెప్పి తమ స్వప్రయోజనాల కోసం తెరచాటు కుట్రచేస్తున్నరానే అనుమానం చాలా మందిలో ఉంది. ఓడలరేవులో జరుగుతోన్న ఆందోళన ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దాదాపు రెండు నెలలుగా ఆందోళన జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు వచ్చిన దాఖలాలు లేవు. ఎంపీ గంటి హరీష్‌మాధూర్‌ వచ్చినా డిమాండ్లు చెబితే మీ తరపున పోరాడతానని హామీ ఇచ్చి మాటలతో సరిపెట్టారని మండిపడుతున్నారు.  


చర్చలు మాటలు గాలికొదిలేసిన ఓఎన్జీసీ 
మార్చి 27న అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో ఓఎన్జీసీ అధికారులకు, గ్రామపెద్దలకు మధ్య చర్చలు జరిగాయి. గ్రామస్తులు తమ ముందుంచిన డిమాండ్లన్నిటికీ అంగీకారం తెలపాలంటే వారం రోజుల గడువు కావాలని ఓఎన్జీసీ అధికారులు కోరారు. కానీ నేటికీ దాని ఊసేలేదు.. ఎమ్మెల్యే, ఆర్డీవో సమక్షంలో జరిగిన చర్చలపై వారి నుంచి ఎటువంటి ఆరా లేదంటున్నారు గ్రామస్తులు. గడువు ముగిసినా ఉద్యమ నేతలు టెంట్లలో కాలక్షేపం చేస్తున్నారని విమర్శ గట్టిగా వినిపిస్తోంది. కాలమే సమాధానం చెబుతుందన్న చందంగా ప్రజాప్రతినిధులు  వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. అసలు ఓడలరేవు ఓఎన్జీసీ వేదికగా ఏం జరుగుతోందంటూ గ్రామంలోని సామాన్య ప్రజల నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


డిమాండ్లపై పెదవి విరుపు..
ఓఎన్జీసీ ముందు గ్రామాన్ని దత్తత తీసుకుని రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని, చదువుకే యువతకు కాలేజీ ఫీజులు చెల్లించాలని, సీఎస్సార్‌ నిధులు గ్రామంలో ఖర్చు పెట్టాలని చెప్పారు. ముంపు అవకాశాలు లేకుండా డ్రైన్‌ వ్యవస్థ  నిర్మించాలని, హౌసింగ్‌కు సంబందించి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కొంత నిధులు సమకూర్చాలని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇలా 17 డిమాండ్లు ఓఎన్జీసీ అధికారుల ముందుంచారు గ్రామస్తులు. డిమాండ్ల సాధనలో నిబద్ధత కనిపించడంలేదన్నది ఆరోపిస్తున్నారు.