సీఎం వైఎస్ జగన్‌కి కుటుంబ సభ్యులను చూసినా భయమే వేస్తోందని నారా లోకేశ్ విమర్శించారు. తల్లిని, చెల్లిని చూసినా జగన్ కి భయమే అని అన్నారు. యువగళం పాదయాత్ర కాకినాడలో జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేశ్ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు చేశారు. పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడని ఆరోపించారు. ఇది కూడా కోడికత్తి లాంటిదేనని లోకేశ్ కొట్టిపారేశారు.


‘‘చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమం చేస్తే జగన్ కి భయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తే జగన్ కి భయం, లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే జగన్ కి భయం. అమ్మని చూసినా జగన్ కి భయమే.. సొంత చెల్లిని చూసినా జగన్ కి భయమే. ఆఖరికి ప్రజల్ని చూసినా జగన్ కి భయమే అందుకే పరదాలు కట్టుకొని దొంగలా వెళ్తాడు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబుని అరెస్ట్ చేసాడు. 53 రోజులు బంధించాడు. 


చంద్రబాబు చేసిన తప్పేంటి? ప్రజల తరపున పోరాడటం తప్పా? జగన్ చేసే తప్పులను ప్రశ్నించడం తప్పా? కుటుంబం కంటే ప్రజలే ఎక్కువ అనుకోని రాష్ట్రం కోసం కష్టపడటం తప్పా? లక్ష కోట్ల ప్రజాధనం దొబ్బిన దొంగ జగన్.. చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించాలని ప్రయత్నించాడు. ముందు 3 వేల కోట్ల అవినీతి  అన్నారు, తర్వాత 370 కోట్లు అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ కి డబ్బులు వచ్చాయి అంటున్నారు. ఆ 27 కోట్లు ఏంటో తెలుసా.. మన పసుపు సైన్యం సభ్యత్వం తీసుకోని కట్టిన రుసుము. ఆరోపణలు తప్ప ఆధారాలు లేవని బెయిల్ ఇస్తూ హైకోర్టు తేల్చేసింది. జగన్ వ్యవస్థల్ని మ్యానేజ్ చేసి చంద్రబాబు 53 రోజులు జైల్లో పెట్టినా ఆఖరికి నిజమే గెలిచింది. 


జగన్ యాత్ర ప్రతి వారం సెలవులే


యువగళం పాదయాత్ర కి జగన్ పాదయాత్ర కి తేడా ఏంటో మీకు తెలియాలి. జగన్ పాదయాత్ర కి ప్రతి వారం సెలవులే... కోర్టు వాయిదా పేరుతో హైదరాబాద్ వెళ్లి ప్యాలస్ లో పడుకునేవాడు. కానీ మీ లోకేష్ యువగళానికి బ్రేకులు లేవు.. శని, ఆదివారం సెలవులు లేవు, కోర్టు కేసులు లేవు, పండగలు లేవు. యువగళం ప్రజాగళం గా మారింది అందుకే జగన్ పాదయాత్ర ను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. పోలీసుల్ని పంపి నన్ను అడ్డుకున్నాడు, నా మైక్ వెహికల్ సీజ్ చేసారు, నా మైక్ పట్టికెళ్లిపోయారు, నేను నిలబడిన స్టూల్ కూడా తీసుకుపోయారు. ఆ తరువాత పిల్ల సైకోలను పంపి రాళ్లు, గుడ్లు వేయించాడు... మన వాళ్లు గట్టిగా తన్ని, కట్లు కట్టి పంపారు. నీది రాజారెడ్డి రాజ్యాంగం..నాది అంబేద్కర్ రాజ్యాంగం. జగన్ ది తాత ఇచ్చిన అహంకారం.. నాది తాత ఇచ్చిన గొంతు. 


సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్ట‌ర్ బియ్యం మ‌ధు. అబ్బో మామూలు టీము కాదు. కరువు - జగన్ కవల పిల్లలు. జగన్ ది దరిద్ర పాదం. 122 ఏళ్లలో ఎప్పుడూ లేని క‌రువు రాష్ట్రాన్ని శ‌నిలా ప‌ట్టిపీడిస్తోంది. సాగునీరు లేక రైతులు రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు. జ‌గ‌నాసురుడి ఇసుక దాహానికి ఏకంగా అన్న‌మ‌య్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. క‌ర‌వుతో రైతులు అల్లాడుతుంటే, క‌నీసం స‌మీక్ష కూడా చేయ‌ని జ‌గ‌న్ కి తెలంగాణ పోలింగ్ రోజు రైతులు గుర్తొచ్చారు. సాగ‌ర్ ఆయ‌క‌ట్టు రైతుల‌పై ప్రేమ పొంగి పొర్లింది.


పోలీసుల్ని పంపి నాగార్జున సాగ‌ర్ పై శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య క్రియేట్ చేయించాడు. ఇదీ మరో కోడిక‌త్తి, బాబాయ్ గుండెపోటు డ్రామా లాంటిదే.. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు’’ అని లోకేశ్ మాట్లాడారు.