Kandrakota Village Devil Ground report: కాండ్రకోట: దాదాపు నెలరోజుల పాటు కంటిమీద కునుకులేకుండా భయాందోళనలతో చివురుటాకుల్లా వణికిపోయిన కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామస్తులు (Kandrakota Village) ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నెల రోజుల పాటు తీవ్ర భయంగా కాలం గడిపిన గ్రామస్తులు ఆ అదృశ్యశక్తి (Ghost in Kakinada) తిరుగుతుందన్న భయాన్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నారు. రాత్రివేళల్లో ఒక్కరుగా బయటకు అడుగుపెట్టాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు. ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు వీధుల్లో కర్రలు, ఆయుధాలు చేతపట్టి పహారా కాచిన గ్రామస్తులు ఇప్పుడు తలుపులు బిగించుకుని నిద్రిస్తున్నారు.


ఇంట్లో నిద్రిస్తున్నా భయం భయంగానే! 
ఒకప్పుడు చాలా మంది వృద్ధులు ఇంటి అరుగుమీద ఆరుబయట నిద్రించే వారు. అది కూడా ఏ భయం బెరుకు లేకుండా నిద్రపోయేవారు. కానీ గ్రామంలో ఎక్కడ చూసినా రాత్రివేళల్లో తలుపులు బిగించుకుని నిద్రపోతున్నారు. వీధి దీపాలతోబపాటు కొందరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఫ్లడ్‌ లైట్లు మాత్రం చాలా మంది ఇళ్ల వద్ద, వీధుల్లోనూ రాత్రంతా వేసే ఉంచుతున్నారు. తెల్లవారు జామున లేచి పొలాలకు వెళ్లే వారు ఉదయం వెలుతురు వచ్చే వరకు ఇళ్లనుంచి కదలడం లేదు. పొలాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకునే వారు సాయంత్రం ఆరు దాటిందంటే చాలు పరుగున ఇళ్లకు చేరుకుంటున్నారు. 




కాండ్రకోట గ్రామంలోని వీధులు మాత్రం రాత్రిపూట పూర్తి నిర్మానుష్యంగా మారాయి. కాండ్రకోట మీదుగా రాకపోకలు సాగించేవారి సంఖ్య బాగా తగ్గింది. కొందరైతే మాత్రం అదృశ్య శక్తి లేదు, దెయ్యం లేదు.. ఇదంతా కావాలనే ఎవరో పుకార్లు పుట్టించారని, అక్రమ మద్యం తయారీ దారులు, లేదా గుప్త నిధులు కోసమో మొత్తం మీద అదృశ్యశక్తి ఉందని ప్రచారం చేశారని వదంతులను కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద నెలరోజుల పాటు సంచలనం రేకెత్తించిన కాండ్రకోట అదృశ్య శక్తి వ్యవహారం మొత్తం మీద కాస్త సద్దుమనిగినట్లు abp దేశం పరిశీలనలో స్పష్టమయ్యింది..



గత కొన్ని రోజులుగా అదృశ్య శక్తి భయంతో వణికిపోతున్న కాండ్రకోట గ్రామంలో మరో భయంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో కొన్ని రోజులుగా అదృశ్యశక్తి కనిపించి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిసిందే. అయితే గ్రామంలో వివాహం కాని ఆడపిల్లలు, చిన్నపిల్లలున్న ఇళ్ల వద్దనే అదృశ్య శక్తి టార్గెట్‌ చేస్తూ వాళ్లను భయపెడుతోందని, దీంతో కన్నె పిల్లలు ఇళ్లు దాటి బయటకు వెళ్లవద్దనే హెచ్చరికలు ఇటీవల గ్రామంలో జారీ చేశారు. దీనికి తోడు గ్రామంలో పలువురి ఇళ్లల్లో అదృశ్యశక్తి కనిపించిందని, ఆ ఇళ్లల్లో పెళ్లికాని ఆడపిల్లలు ఉన్నారని, ఈ క్రమంలో వారి ఇళ్లను టార్గెట్‌ చేసిందని ప్రచారం మరింత పెరిగింది. దీంతో గ్రామంలోని పెళ్లికాని అడపిల్లలున్న కుటుంబాలు ఊరు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా గ్రామంలో స్కూల్‌కు కూడా ఆడపిల్లలను వెళ్లనీయని పరిస్థితి తలెత్తింది.. ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం కాండ్రకోట గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడింది.