YS Jagan Siddham Meeting: అనంతపురం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై, కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి (Raghuveera Reddy) విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం దేనికి సిద్ధం అంటూ ప్రశ్నించారు. దేనికి సిద్ధమై రేపు (ఈ 18న) అనంతపురం వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అంటూ నాలుగు పాయింట్స్‌కు సమాధానం చెప్పాలని ఏపీ సీఎంను ప్రశ్నించారు. హంద్రీనీవాతోపాటు, అనంతపురం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ జగన్ అంటూ మాజీమంత్రి రఘువీరారెడ్డి ప్రశ్నించారు. 



ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి పరిష్కారం కాని నాలుగు ప్రధాన అంశాలు ..



1) ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు ,మరి ఎందుకు సిద్ధం కాలేకపోయారు, ఎప్పుడు సిద్ధం అవుతారు?



2) అనంతపురం జిల్లాలో ప్రాజెక్టు అనంత కు కేంద్రం 7,860 కోట్లు మంజూరు చేస్తే మీరు ఎందుకు పూర్తి చేసేందుకు సిద్ధం కాలేదు



3) రాయదుర్గంలో కుదురేముక్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేందుకు ఎందుకు సిద్ధం కాలేదు, ఎప్పుడు సిద్ధమవుతారు



4) ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలు ఏపీఐఐసీకి అప్పగిస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎందుకు సిద్ధం కాలేదు? ఎప్పుడు సిద్ధమవుతారు?


కాంగ్రెస్ పార్టీని పొడిచి పొడిచి చంపారు..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పైకి వచ్చిన మీరంతా మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీని పొడిచి పొడిచి చంపేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న 20 మంది కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు రఘువీరారెడ్డి దీటుగా స్పందించారు. సాయిబాబా డబ్బులను రఘువీరారెడ్డి తరలించారంటూ అన్నావు కదా పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి మరి అప్పుడు మరి నీ లారీల్లోనే తరలించానేమో మొదటి సాక్షిగా నువ్వేగా.. విచారణ జరిపించు అంటూ సవాల్ విసిరారు. జిల్లాలో ఉన్న అందరిని సాక్షులుగా చేర్పించి ఎందుకు విచారించలేదు అని మంత్రి పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మీది కదా నిరూపించండి ఎలాంటి చర్యలైన తీసుకోండి, కానీ అనవసరంగా నిందలు వేస్తే సహించేది లేదంటూ మంత్రి పెద్దిరెడ్డికి  రఘువీరారెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం అన్నారు. కానీ వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఆదివారం జరిగే సిద్ధం సభలో ప్రజలకు వివరించగలరా అని ఏపీ సీఎంను నిలదీశారు.