- ఆరోగ్య సిబ్బందిపై సర్పంచ్‌ రుబాబు...
- హెల్త్‌ సూపర్‌వైజర్‌పై చేయిచేసుకున్న వైసీపీ సర్పంచ్‌
- జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు..


ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్‌ అయ్యారు..? అసలు నేను సర్పంచ్‌నని తెలుసా.. మీరు నా కిందే పనిచేయాలని తెలుసా... నా పర్మిషన్‌ లేకుండా డ్యూటీకు ఎలా హజరవుతారు..? జీతాలు ఎలా పంపిస్తున్నారు.. ఎవరు ఇస్తున్నారు..?  మీ సంగతి తేలుస్తా.. ఇదీ కాట్రేనికోన మండలంలో ఓ వైసీపీ సర్పంచ్‌ రుబాబు. ఈ గొడవ ఎవ్వరితో అనుకుంటున్నారా.. ప్రభుత్వ ఉద్యోగులతో నిరంతరం ఆరోగ్యసేవల్లో నిమగ్నమయ్యే ఆరోగ్య సిబ్బందిపై ఆ సర్పంచ్‌ రుబాబు ప్రదర్శించారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది..  కాట్రేనికోన మండలం స్థానిక పీహెచ్‌సీ పరిధిలో ఇటీవలే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా ఇద్దరు జాయిన్‌ అయ్యారు. అయితే స్థానిక సర్పంచ్‌ గంటి వెంకట సుధాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఈ ఇద్దరు ఉద్యోగులు కాట్రేనికోన గ్రామ సచివాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సర్పంచ్‌ నన్ను కలిసేందుకు ఇన్నాళ్లకు వస్తారా.. అసలు మీరు ఉద్యోగం చేస్తున్నారా.. అంటూ రుబాబు ప్రదర్శిస్తూ నానా దుర్భాషలాడారని ఉద్యోగులు వాపోయారు. ముందు సచివాలయ మెట్లు దిగి వెళ్లాలంటూ హెచ్చరించడంతో వారు తిరిగి వెళ్లి పీహెచ్‌సీ మెడికల్‌ అధికారికి తెలిపారు.


సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తే కొట్టారు..
ఈ సంఘటనపై మెడికల్‌ అధికారి నీలిమ స్పందించి వెంటనే సర్పంచ్‌ వద్దకు మరళా హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉచ్చుల రాధాకృష్ణను, సీహెచ్‌వో శ్రీహరిలను, హెల్త్‌ అసిస్టెంట్‌ ఫణికుమార్‌లను వెంట పంపారు. అంతకుముందు మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నీలిమ ఫోన్‌లో సర్పంచ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మహిళ అని కూడా చూడకుండా సర్పంచ్‌ రెచ్చిపోయి ఆమెతో కూడా చాలా దారుణంగా మాట్లాడాడని డాక్టర్‌ నీలిమ ఆరోపించారు. సిబ్బందిని మీవద్దకు పంపిస్తామని డాక్టర్‌ చెప్పి ఫోన్‌ పెట్టేశానని తెలిపారు. దీంతో ఆరోగ్య సిబ్బంది సర్పంచ్‌ను కలిసేందుకు సచివాలయానికి వెళ్లిన క్రమంలో సర్పంచ్‌ లేకపోవడంతో వీరంతా కలిసి సర్పంచ్‌ ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్‌ వెంకటసుధాకర్‌ మళ్లీ రెచ్చిపోయారు.


హెల్త్‌ సూపర్‌వైజర్‌పై చేయి చేసుకున్న సర్పంచ్‌...
సర్పంచ్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన ఆరోగ్య ఉద్యోగులపై సర్పంచ్‌ రుబాబు ప్రదర్శించడంతోపాటు వీరిని వెంటబెట్టుకుని వెళ్లిన సూపర్‌వైజర్‌పై చేయిచేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. సర్పంచ్‌కు హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించినా అదేమీ పట్టించుకోకుండా సర్పంచ్‌ రెచ్చిపోయారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ చెంపపై కొట్టి గెంటివేశారు. దీంతో వారంతా మరోసారి రిక్వెస్ట్‌ చేస్తున్నా అవేమీ పట్టించుకోకుండా మరోసారి కొట్టిగెంటారు. తన ఇంటి వద్దనుంచి వెళ్లాలని హుకూం జారీచేశాడని వారు వాపోయారు.  


జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు..
ఆరోగ్య సిబ్బందిపై వైసీపీ సర్పంచ్‌ గంటి వెంకట సుధాకర్‌ దాడిచేయడాన్ని నిరసిస్తూ కాట్రేనికోన మండలం వైద్యఆరోగ్య సిబ్బంది డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను సోమవారం స్పందన కార్యక్రమంలోకలిసి ఫిర్యాదు చేశారు. తామంతా ఉద్యోగంకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చామని సర్పంచ్‌ లాంటి వ్యక్తులతో తమకు భద్రత కరవైందని వారు వాపోయారు. అయితే కలెక్టర్‌ దీనిపై స్పందించి ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తమకు ఉందని భరోసా ఇచ్చారు. దీనిపై పోలీసులతో విచారణ పూర్తిచేసి న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు.