Konaseema News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. తండ్రి తరఫున చేపట్టిన ఈ కార్యక్రమంలో.. గ్రామస్థులు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి అంటూ స్థానికులు విరుచుకు పడ్డారు. తమ బిడ్డలను మూడు నెలల పాటు జైలులో పెట్టించారని కన్నీరు పెట్టుకున్నారు. మీ ఇంటి దహనాలతో మాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అధికారం ఉందికదా అని అమాయకులను ఇరికిస్తే... చూస్తూ ఊరుకోం అంటూ స్థానికులు శ్రీకాంత్ పై మండిపడ్డారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా కామన గరువు విత్తనాల వారి కాలవగట్టు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 


శ్రీకాంత్ వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు మాత్రం ఏమాత్రం మాట వినలేదు. మీ మీద మాకు కోపం లేదని. కానీ మీ తండ్రి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని తెలిపారు. కేసులు పెట్టించి మళ్లీ మా ఇళ్లకు ఎందుకు వచ్చారు అంటూ ప్రశ్నించారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించేందుకే వచ్చానని... తనను అర్ధం చేసుకోవాలని శ్రీకాంత్ స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా  వారు వినకపోవడంతో చేసేది ఏమి లేక మంత్రి కుమారుడు వెనుదిరిగాడు. 


రెండు నెలల క్రితం వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం


పూతల పట్టు నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కు అడుగడుగునా చేదు అనుభవం ఎదురవుతోంది. వైసీపీ‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు నేరుగా ప్రజల‌ వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలను‌ తెలియజేస్తున్నారు. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజల నుండి వ్యతిరేకత వస్తూనే ఉంది. నాలుగేళ్ళ తరువాత మా గ్రామానికి ఎందుకు వస్తున్నావంటూ ప్రజలే నేరుగా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు అక్కడి నుండి వెనుదిగాల్సిన పరిస్ధితి వస్తుంది.  


చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజక వర్గం వైసీపీ‌‌ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు గత కొద్ది‌ రోజులుగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు హాజరవుతూ ప్రజలను నేరుగా కలుస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా వింటూ వాటిని పరిష్కారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యేకు మాత్రం చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. రెండు నెలల క్రితం అమ్మగారిపల్లె, చిన్నబండపల్లె గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్ళిన ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు అడ్డుకుని తమ గ్రామానికి రావద్దంటూ రోడ్డుపై బైఠాయించి‌ నిరసన తెలిపారు.