గోదావరి నది మధ్యలో పడవ ఆగిపోవడం వల్ల అది కొట్టుకుపోయి ఏకంగా అందులో ఉన్న 15 మంది వరకు ఉన్న పాడి రైతులు గల్లంతయ్యారు. ఈ పడవ దాదాపు 7 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ద్వారా అధికారులు ఈ విషయం తెలుసుకొని ఇంజిన్ బోట్ల సాయంతో సురక్షితంగా రక్షించారు. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం యలకల్లంకకు చెందిన పాడి రైతులు లంకలో ఉండే పశువులను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ఇంజన్ పడవపై 15 మంది రైతులు కలిసి వెళ్లారు.
లంకలో ఉన్న పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన 15 మంది రైతులు పశువులు తీసుకువస్తుండగా గోదావరి మధ్యలో పడవ ఆగిపోయింది. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. గోదావరి ఉధృతికి సుమారు 7 కిలోమీటర్లు దాదాపు యానాం వద్ద మసకపల్లి వరకు పడవ కొట్టుకుపోయింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో కోటిపల్లి నుండి ఇంజన్ బోట్లను తెప్పించి వాటి సాయంతో అధికారులు రైతులను కాపాడారు. వారు సురక్షితంగా బయట పడటంతో రైతులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలవరం వద్ద ఉప్పొంగిన గోదావరి
ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే 48 గేట్ల నుండి భారీగా వరద ప్రవాహం ప్రవహిస్తోంది. లోయర్ కాపర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ ముంపునకు గురైంది. పూర్తిగా గోదావరిలో మునిగిపోయింది. దీంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి. బలహీనంగా ఉన్న గోదావరి కథలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
భద్రాచలం వద్ద ఇలా
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద సాయంత్రం 4 గంటలకు గోదావరి వరద ఉద్ధృతి 53 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అత్యవసర సేవలకు కలెక్టర్ కార్యాలయపు కంట్రోల్ రూమ్ 08744-241950, వాట్సప్ నంబర్ 9392929743, ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, వాట్సప్ నంబర్ 9392919750, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743232444, వాట్సప్ నంబర్ 6302485393 ద్వారా అత్యవసర సేవలు పొందాలని ఆయన చెప్పారు.