ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతటా విస్తరించిన రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తోడుకావడంతో వర్షపాతం భారీగా నమోదవుతుంది. వీటికితోడు ఎగువన కురుస్తున్న వానల కారణంగా నదుల్లోకి వరదనీరు భారీగా చేరుకుంటోంది. దీంతో గోదావరి, కృష్ణా లాంటి నదుల్లోని ప్రవాహం అనూహ్య స్థాయిలో పెరిగింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరకోస్తా, కృష్ణా, గుంటూరులో భారీ వర్షాలు కురుస్తుండగా , దక్షిణ కోస్తా,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి . 


గోదావరి ఉగ్రరూపం :


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం వల్ల, పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. వరద కారణంగా పోలవరం స్పిల్‌వే మీదుగా లక్షల క్యూసెక్కుల ప్రవహం సముద్రలోకి వెళుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో మొత్తం నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద పరిస్థితిని మంత్రి అంబటి రాంబాబు సమీక్షించారు. వరద ప్రభావంపై అధికారులతో కలిసి పరిశీలించారు.ఒక్కసారిగా 8 లక్షల క్యూసెక్కుల వరకూ వరద నీరు పోలవరం వద్దకు చేరుకుందనీ దానితో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయినట్టు ఆయన తెలిపారు. ఈ ఉదయానికల్లా 14 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరికి చేరుకునే అవకాశం ఉందనీ .. ఇప్పటికే లోయర్ కాపర్ డ్యాం నుంచి వరద నీరు పోలవరం ప్రాజెక్ట్ లో పనులు జరుగుతున్న ప్రాంతానికి రావడం తో అవి నిలిచి పోయినట్టు తెలిపారు. అలాగే ఎగువ కాపర్ డ్యామ్ నుంచి వరద నీరు రావడం వల్ల డయాఫ్రమ్ వాల్ చాలా చోట్ల దెబ్బతిన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒక్కసారిగా వరద నీరు  చేరడంతో అక్కడ పెద్దపెద్ద అగాధాలు ఏర్పడ్డట్టు మంత్రి తెలిపారు . 


ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉధృతం గా ప్రవహిస్తున్న గోదావరి :
రాజమండ్రి సమీపంలో గల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం 9.60 అడుగులకు చేరింది. అలాగే 175 గేట్లు ఎత్తి దిగువకు 7.60 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దాంతో కోనసీమ లంక గ్రామాల్లోకి వరద నీరు భారీ చేరింది. దేవీపట్నంలోని గండిపోచమ్మ ఆలయం నీటమునిగింది. అలాగే పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు.రాజమండ్రి లోగల కోటిలింగాల రేవు ,గోదావరికి మరోవైపున గల కొవ్వూరు వద్దగల గోష్పాద క్షేత్రాల వద్ద గోదావరి ప్రవాహం చూపరులను భయపెడుతోంది .  ఎర్రకాలువ పరిధిలో నిడదవోలు, తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి.


పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల అప్రమత్తం :
పశ్చిమ గోదావరిలో వర్షాలకారణంగా  కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎర్రకాలువ, తమ్మిలేరు జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.   ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాగులు దాటే సమయంలో  నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లో రోడ్లు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి


ఏజెన్సీలో పాఠశాలలకు సెలవులు


కూనవరంలో గోదావరి నీటిమట్టం పెరగడంతో  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.  ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం  కలుగుతోంది.  85 గ్రామాలకు రాకపోకలు  స్తంభించాయి.  కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఏటపాక మండలాల్లో వరదలు తగ్గే వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.  


తుంగభద్రకు భారీగా వరద నీరు
ఎగువున కురుస్తున్న వర్షాలతో  తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది.  క్షణమైనా  తుంగభద్ర నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుంగభద్ర  ఇన్ ఫ్లో 92,160 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 423 క్యూసెక్కులుగా ఉంది.  తుంగభద్ర జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1628 అడుగులకు చేరింది.  తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా ఉంది 


ఏపీలో తిరిగే పలు రైళ్ల రద్దు 
భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.  సోమవారం నుంచి మూడ్రోజుల పాటు విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు  ప్రకటించారు.  ట్రైన్‌ నంబర్ 17267/17268  కాకినాడ పోర్ట్‌-విశాఖపట్నం-కాకినాడ పోర్ట్‌ మెమూను రద్దు చేశారు. దీంతో పాటు ట్రైన్‌ 07978/07977 విజయవాడ-బిట్రగుంట-విజయవాడ ప్యాసింజర్‌ రైలు రద్దైంది.  మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.17258 కాకినాడ -విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ పోర్ట్‌-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. తిరుగు ప్రయాణంలో కూడా రాజమండ్రి వరకు మాత్రమే నడుపనున్నారు. 


ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల
విజయవాడలోనూ  ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.దానితో   ప్రకాశం బ్యారేజీ  నుంచి సముద్రంలోకి నీటిని వదులుతున్నారు. మున్నేరు, పాలేరు, బుడమేరుల నుంచి భారీగా వరద నీరు కృష్ణా నదికి వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువున నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వరద ప్రవాహం మొత్తాన్ని  సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బ్యారేజీ 45 గేట్లను ఎత్తి 40వేల క్యూసెక్కుల నీటిని  దిగువకు వదులుతున్నారు. 


అల్లూరి జిల్లాలో దేవీపట్నం గండి పోశమ్మ ఆలయం నీటమునక
అల్లూరి జిల్లా లోని  దేవీపట్నం మండలం లోగల గండి పోశమ్మ ఆలయం నీట మునిగింది . గండి  పోశమ్మ ఆలయ గర్భగుడిలో అమ్మవారి మెడకంఠం వరకు గోదావరి వరద నీరు చేరింది . గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం సమీప గ్రామాల ప్రజలను భయపెడుతోంది . ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం వద్దకు వరద నీరు చేరుకుంది . దండంగి గ్రామం నుండి పోశమ్మగండి వైపుగా వెళ్ళే రహదారులు పూర్తిగా జల దిగ్బంధం కావడంతోపాటు ఇప్పటికే  ఖాళీ చేసిన 40  గ్రామాలు పూర్తిగా బయటి ప్రపంచం తో సంబంధాన్ని కోల్పోయాయి .