Andhra Pradesh Politics : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) పొలిటికల్ రీఎంట్రీ ఖాయమైంది.. ఆయన వైసీపీ(YSRCP) గూటికి చేరనున్నారు. ముద్రగడ నివాసానికి వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy), వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. మిథున్ రెడ్డి ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ముద్రగడ పద్మనాభం...త్వరలోనే వైసీపీలో చేరుతానని హామీ ఇచ్చారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన రాజంపేట ఎంపీ, వైసిపి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి...సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన ముద్రగడ... వైసీపీలోకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 


ముద్రగడ తనయుడికి నామినేటెడ్ పోస్టు
పార్టీలోకి మీరు ఆహ్వానిస్తున్నారా ? లేదంటే పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఆహ్వానించమంటే వచ్చారా అని ముద్రగడ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాలతోనే వచ్చామని చెప్పడంతో వైసీపీలో చేరేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు. పార్టీ ఇష్టమే తన ఇష్టమని, కచ్చితంగా పోటీ చేయాలని ఏమీ లేదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీని పార్టీలో చేర్చుకోవాలని వైసిపి భావిస్తోంది. అమవాస్య తర్వాత ముద్రగడ ఫ్యామిలీ అధికారికంగా పార్టీలో చేరిక తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు వైసీపీ నేతలు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 


ఏడాదిగా వైసీపీలో చేరుతారని ప్రచారం
2009లో  ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మనాభం అక్కడ ఓటమితో జీవితంలో ప్రత్తిపాడు ప్రజలను ఓట్లు అడగనని శపధం చేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి  కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. గత టిడిపి ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమం చేయడం తన వల్ల కావడం లేదని, కాపుల కోసం ఎవరైనా పోరాడితే మద్దతు ఇస్తానని ప్రకటించారు. గత ఏడాది నుంచి వైసీపీలో చేరుతారని జోరుగా చర్చలు జరిగాయి.. దానికి తగ్గట్లుగా సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. 


పవన్ కల్యాణ్ కు వరుస లేఖాస్త్రాలు
ఈ ఏడాది జనవరిలో జనసేన నేతలు ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి చర్చించారు. ముద్రగడ నివాసానికి పవన్ కల్యాణ్ వస్తారని జనసేన నేతలు, ముద్రగడ అనుచరులు ప్రచారం చేశారు. ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం పవన్ కల్యాణ్ కి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. పవన్ తమ ఇంటికి రావాలంటే పర్మిషన్లు కావాలని, అయినా ఆయన పార్టీ పోటీ చేసే 24 సీట్ల కోసం తన అవసరం ఉండదని క్లారిటీ ఇచ్చారు.. దాంతో అధికార పార్టీ మరొకసారి పద్మనాభంను పార్టీలో చేర్చుకోవడంపై చర్చలు జరిపింది.. ఉభయగోదావరి జిల్లాలలో ముఖ్యంగా కాపు కమ్యూనిటీలో ఆయనను చేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని అంచనా వేసింది. తీవ్ర తర్జనభర్జనల మధ్య ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రి జరగనుంది