Kakinada News: విద్యాబుద్ధులు నేర్చుకుంటారని స్కూల్ కు తమ పిల్లల్ని పంపిస్తే ఇంటి పనులు చేయించుకుంటున్నాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు అడిగితే చెప్పలేదు. కానీ బుజ్జగించి అడిగితే ఆ ఉపాధ్యాయుడు చేయిస్తున్న పనుల గురించి వివరించారు. ప్రతిరోజూ ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లల్ని ఒంటరిగా ఇంటికి తీసుకెళ్లి ఆరుబయట చీపురుతో ఊడవమంటున్నాడని, గదులను కూడా శుభ్రంగా ఊడ్చి తుడవమంటున్నాడని అంతే కాకుండా మొక్కలకు నీళ్ల పట్టమంటున్నాడని చెప్పారు. దీంతో కోపోద్రోకులైన తల్లితండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ఆ ఉపాధ్యాయుడ్ని నిలదీశారు. కోపంతో రగిలిపోయి కొట్టేంత పని చేశారు. దీంతో బుద్ధి వచ్చిందంటూ తన చెప్పు తీసుకుని తనను తానే కొట్టుకున్నాడు. ఈ సంఘటన కాకినాడ జిల్లా పరిధిలోని జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
అసలు ఏం జరిగిందంటే...?
సీతానగరం గ్రామంలో స్థానిక ప్రాధమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక్కడి ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆనంద బాబు అనే ఉపాధ్యాయుడు కొంత మంది విద్యార్థులను రోజూ తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పనులు చేయిస్తున్నాడు.. ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా ఒంటరిగా తీసుకెళ్లి చాకిరీ చేయిస్తున్నాడని తల్లితండ్రులకు తెలిసింది. దీంతో పిల్లల్ని ఆరా తీయగా మొదట వారు చెప్పలేదు. ఆ తర్వాత మెల్లిగా బుజ్జగించి అడిగితే అసలు విషయం చెప్పారని, గదుల్లో కూడా ఒంటరిగా తుడువ మంటున్నాడని చెప్పినట్లు వెల్లడించారు. పిల్లలు చాలా భయపడుతూ ఆ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. మగ పిల్లల్ని వెంట బెట్టుకుని పాత ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడ వారిచేత పిచ్చి మొక్కలు తొలగించడం, ఇతర పనులు చెప్పి చాకిరీ చేయిస్తున్నాడని తల్లితండ్రులు ఆరోపించారు.
నిలదీస్తే చెప్పుతీసుకుని కొట్టుకున్న ఉపాధ్యాయుడు..
విద్యార్థులు తల్లితండ్రులు అంతా మూకుమ్మడిగా స్కూల్ వద్దకు వచ్చి ప్రధానోపాధ్యాయుడు ఆనంద బాబును గట్టిగా నిలదీశారు. ముందు అదేం లేదని చెప్పినా.. విద్యార్థులు స్వయంగా చెప్పడంతో తప్పయిపోయింది.. అంటూ కాలికున్న చెప్పు తీసుకుని లెంపలు వాయించుకున్నాడు. దీంతో కొంత వరకు శాంతించిన తల్లితండ్రులు, గ్రామస్థులు ఉపాధ్యాయుని తీరుపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేశారు.
పిల్లలపై అఘాయిత్యాలు చూస్తున్నాం..!
పిల్లల్ని ఇంటి పని పేరుతో అసలు టీచర్ ఎందుకు తీసుకెళ్తున్నాడని ఓ విద్యార్థి తల్లి ఫైర్ అయింది. టీవీల్లోనూ, పత్రికల్లోనూ ఎన్ని చూడడం లేదు.. ఇదిలా వదల వద్దనే ఉద్దేశంతోనే అందరినీ తీసుకొని బడికి వచ్చినట్లు చెప్పింది. ఏదైనా ఘోరం జరగక ముందే మనం అప్రమత్తమవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ విషయం వెలుగులోకి తీసుకువచ్చామని తెలిపింది. ఇదిలా ఉంటే సదరు ఉపాధ్యాయుడికి మద్యం సేవించే అలవాటు కూడా ఉందని, ఈ పాఠశాలలు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఇతను పిల్లలికి ఏ పాఠాలు చెప్పకుండా పడుకుంటాడని, పిల్లలకి అక్షరాలు రావడం లేదని తీవ్ర ఆరోపణలు చేసిందామె. ఇప్పటికైనా ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకొని.. పిల్లలకు కేవలం చదువు మాత్రమే చెప్పే ఉపాధ్యాయులను ఇక్కడకు పంపించమంటూ కోరింది. చదువు చెప్పకుండా ఇలా పనులు చేయిస్తే వచ్చిన నాలుగు అక్షరాలు కూడా పిల్లలు మర్చిపోతారని వివరించింది.