Kakinada Kachidi Fish: ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మత్స్యకారులకు దొరికే చేపల్లో పులస చేప ఒకటి. చాలా మంది పుస్తెలమ్మైనా సరే పులస చేపలు తినాలి అని నానుడి చెబుతారు. కానీ పులస చేపలకంటే ఎక్కువ ధర పలికే అరుదైన రకం చేపల గురించి కొందరికే తెలుసు. అటువంటి చేపల్లో కచిడి చేప ఒకటి. రెండేళ్ల కిందట దాదాపు ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో వలకు చిక్కిన కచిడి చేప లక్షలు కురిపించింది. అప్పుడు కచిడి చేప లక్ష రూపాయలు పలికితే అమ్మో అంత ధర అన్నారు. ఇప్పుడు కాకినాడ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన కచిడి చేప ఏకంగా రూ.3.10 లక్షల రికార్డు ధర పలికింది. మత్స్యకారుడి పంట పండించింది.


కాకినాడ జిల్లా మత్స్యకారుడి వలకు 20 కేజీల కచిడి చేప చిక్కింది. అరుదుగా లభించే  ఇది అత్యంత అరుదుగా లభించే చేప కావడంతో వీటికి సాధారణంగానే డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ కచిడి చేపను కుంభాభిషేకం రేవులో వేలం పాట పాడగా పలువురు చేపను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. చివరగా ఓ వ్యాపారి ఏకంగా 3 లక్షల 10 వేల రూపాయలకు ఈ భారీ కచిడి చేపను సొంతం చేసుకున్నారు. వేలం పాట ద్వారా మధ్యవర్తికి సైతం రూ.25 వేలు దక్కాయంటే మాటలు కాదు. ఈ కచిడి చేపలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని తెలిసిందే. మందుల తయారీలో కచిడి చేప పిత్తాశయం, ఊపిరితిత్తులను వినియోగిస్తారు. దాంతోపాటు కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో శస్త్రచికిత్స అనంతరం వేసే కుట్లకు దారం సైతం తయారు చేస్తారు. కచిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కచిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తుంటారు. ఖరీదైన వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడానికి వినియోగిస్తారని చెబుతుంటారు.   


మగ చేపకు కాసుల వర్షం..
తూర్పుగోదావరి జిల్లాలో రెండేళ్ల కిందట మత్య్సకారుడికి కచిడి చేపలు కాసులు కురిపించాయి. అరుదుగా దొరికే ఈ చేపలకు స్థానికంగా చాలా గిరాకీ ఉంటుంది. వేలలో, కొన్ని సార్లుల్లో లక్షల్లో అమ్ముడుపోతుంటాయి. వల వేసిన ప్రతిసారీ జాలర్లు అరుదైన చేపలు వలలో చిక్కాలని తమ కష్టాలు గట్టేక్కాలని కోరుకుంటారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జాలర్ల వలకు అరుదైన కచిడి చేపలు పడ్డాయి. 


రికార్డు ధర పలికిన మగ చేప, ఆడ చేపకు రూ.30 వేలు
అంతర్వేది పల్లిపాలెం హార్బర్‌లో అమ్మకానికి పెట్టిన మగ, ఆడ కచిడి చేపలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ చేపల్లో మగది 16 కిలోల బరువు ఉండగా, ఆడచేప 15 కిలోలు తూగింది. స్థానిక మార్కెట్ లో వీటిని అమ్మకానికి పెట్టగా మగ చేప లక్ష రూపాయలు, ఆడచేప రూ.30 వేల ధర పలికాయి. ఈ చేపల పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని అంటున్నారు. మగ చేపలో ఎక్కువగా ఔషధాలు ఉండడం వల్ల దానికి ఎక్కువ రేటు ఉంటుందని మత్య్సకారులు తెలిపారు. ఈ ఔషధ గుణాల వల్లే కచిడి చేపలకు అధిక గిరాకీ ఉంటుందని మత్స్యశాఖ ఏడీ కృష్ణారావు తెలిపారు. ఇలాంటి చేపలు అరుదుగా జాలర్ల వలలో చిక్కుతాయని తెలిపారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial