ఆ పార్టీ చేసేది మతతత్వ రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు అని బీజేపీ నేతలపై ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మతాన్ని అడ్డుకుని రాజకీయాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ హయాంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను కూల్చుతుంటే ఈ ఆవేశం ఎక్కడికి పోయిందంటూ సెటైర్లు వేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యాలపై ఇదివరకే మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. తాజాగా కురసాల కన్నబాబు సైతం స్పందిస్తూ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్ని మతాలను గౌరవిస్తారని, అందరినీ సమానంగా చూస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగేలా పునరుద్ధరణ చేశారని గుర్తుచేశారు. అర్చకులకు ఆర్థిక సహాయం అందించడం సహా దూపదీప నైవేద్యాలు సమర్పించి రాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 40 వరకు ఆలయాలను కూల్చివేసిందని, ఆ సమయంలో బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మతతత్వ రాజకీయాలు చేయడమే బీజేపీ స్ట్రాటజీనా, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం ఏమైనా ఉందా, లేక విధ్వేషాలను రెచ్చగొట్టడమే మీకు పనా అంటూ కన్నబాబు మండిపడ్డారు. సునీల్ దేవ్ దర్ లాంటి నేతలు చాలా అవమానకరంగా ట్వీట్లు చేస్తున్నారని, ఇలాంటి నేతలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తే ఇంకా దిగజారిపోతారంటూ సోము వీర్రాజుకు చురకలు అంటించారు.


అసలు వైసీపీ ట్వీట్ ఏంటంటే..
మహా శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో శుభాకాంక్షలు తెలిపిన తీరుపై వివాదం మొదలైంది. ఆ ట్వీట్ పై ఏపీ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బాల శివుడికి సీఎం వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న కంప్యూటర్ గ్రాఫిక్స్ ఫోటో ఒకటి ట్విటర్ లో వైఎస్ఆర్ సీపీ విడుదల చేసింది. దీనిపై మహా శివరాత్రి నాడు అపచారం అంటూ బీజేపీ రంగంలోకి దిగింది. ఆ ఫోటో ట్వీట్‌ చేసి ‘‘అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధన. ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో శనివారం నాడు (ఫిబ్రవరి 18) అధికారికంగా ట్వీట్ చేసింది.


వైసీపీ విషెస్ పై సోము వీర్రాజు ఫైర్ 
వైఎస్సార్ సీపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన తీరు పట్ల సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఆ ఫోటోలో వైఎస్ జగన్ పాలు తాగిస్తున్న బాలుడు శివుడి తరహాలో పులి చర్మం ధరించి, చేతిలో ఢమరుకం, నుదుటన నామాలతో ఉండగా దాన్ని సోము వీర్రాజు తప్పుబట్టారు. ఈ ఫోటోపై ఆయన ట్విటర్ ద్వారానే స్పందిస్తూ.. ‘‘పేద వాళ్ళు అని పేర్కొంటూనే చేతిలో ఢమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం మరియు హిందువుల మనోభావాల పట్ల వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక, ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్ సీపీని డిమాండ్ చేస్తున్నాను’’ అని సోము వీర్రాజు తన సొంత ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు.