Chandrababu Arrest: ప్రజాస్వామ్య చరిత్రలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి కేసు ఎక్కడా చూడలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును సోమవారం ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు ములాఖత్‌ ద్వారా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కనీస ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారన్నారు.  


చంద్రబాబుతో ములాఖత్ అనంతరం జైలు బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏదైనా  కేసుపెట్టాలంటే కనీస ఆధారాలు ఉండాలని, కానీ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని, చంద్రబాబును రెండ్రోజుల పాటు ప్రశ్నించారని. ఏమైనా ఆధారాలు దొరికాయా? అంటే అధికారుల వద్ద సమాధానం లేదన్నారు. సీఐడీ అధికారుల విచారణలో చంద్రబాబుకు 33 పనికిమాలిన ప్రశ్నలు వేశారని తెలిపారు. నేటికి 16 రోజులు గడిచినా కేసులో చిన్న ఆధారం కూడా లేదని చెప్పారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టిందన్నారు. 


14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జైల్లో పెట్టారని మండిపడ్డారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన రూ.లక్షల కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేశారని, అలాంటి వ్యక్తి రూ.330 కోట్ల అవినీతి చేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ యువత రోడ్డెక్కిందని, ఉద్యమాన్ని అణచివేయాలని పోలీసులు చూస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. 


రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ బలపడుతుండటాన్ని ఓర్వలేక, రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్రతోనే చంద్రబాబును అరెస్టు చేశారని అచ్చెన్న విమర్శించారు. ఏపీలో పరిణామాలను జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. ఈ క్రమంలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు లాయర్లతో చర్చించి సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.


చంద్రబాబుకు కస్టడీ..
రిమాండ్ ఖైదీకి వారానికి రెండు ములాఖత్‌లు ఉంటాయి. చంద్రబాబుకు గత వారం రెండు ములాఖత్‌లు ఉన్నా ఒక్కదానినే ఉపయోగించుకున్నారు. అయితే ఈ వారం చంద్రబాబును సీఐడీ కస్టడీలోకి తీసుకోవడం, ఆయన్ను విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు సోమవారం ఆయనతో ములాఖత్ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయనకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది కాలంగా జైలులో చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాలపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. 


జైలులో చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆయన రూములోకి దోమలు వస్తున్నాయని, జైలులో ఓ ఖైదీ డెంగ్యూతో మరణంచారని అన్నారు. చంద్రబాబును సైతం ఇదే తరహాలో హతమార్చడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, అచ్చెన్నాయుడు, పత్తిపాటి పుల్లారావు చంద్రబాబును కలిశారు.