చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ని పొడిగించారని, ఆయన పాపం పండినందువల్లే జైలుపాలు అయ్యారని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. సోమవారం (సెప్టెంబరు 25) ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ప్రస్తావన తీసుకురాగా.. ఎంపీ ఈ విధంగా స్పందించారు. ప్రజలకు చెందిన వందల కోట్లు అడ్డదార్లలో తండ్రీ కొడుకులు కలిసి మళ్ళిస్తే.. ఎవరు ఊరుకున్నా చట్టం ఊరుకోదని అన్నారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చాలా చిన్నదని, బాబు హయాంలో భారీ స్కామ్ లు రూ.వేల కోట్లలో జరిగాయని అన్నారు‌.


యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో రూ.370 కోట్లు దారి మళ్ళించిన విషయంలోనే కాదు.. సీఐడీ బాబు స్కామ్ లు అన్నిటిపైనా చాలా లోతుగా దర్యాప్తు చేస్తోందని అన్నారు. చాలా ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే గానీ సీఐడీ ముందడుగు వేయదనే విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. టీడీపీ నేతలు చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని, రాజకీయ కక్షసాధింపు చర్యలని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని అన్నారు. అక్రమంగా అరెస్టు చేస్తే కోర్టు ఎటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ విధిస్తుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సచ్ఛీలుడుగా బయటకు రావాలంటే స్కిల్ స్కాంలో సీఐడీ అడిగే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పవచ్చు కదా అన్నారు. 


పూర్తి వాస్తవాలు రావాలంటే డిజైన్ టెక్ సీఈఓ, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల మాఫియా శిరీష్, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులు తరలింపు చేసిన మనోజ్ వాసుదేవ్ పార్ధసాని.. ఇలా చాలామంది ఉన్నారని, వీరందరినీ అదుపులోకి తీసుకుని‌ విచారించే పనిలో సీఐడీ ఉందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, ఎవరికైనా ఒకటేనని అన్నారు. తండ్రిని జైలు నాలుగు గోడల మధ్య నుంచి బయటకు తీసుకురావాలని లోకేష్ అనుకుంటే.. మరి ఆయన బయటే ఉన్నాడు కదా అని అన్నారు. పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్ చేత జరిగిన విషయాలను సీఐడీకి తెలియజేసి, చంద్రబాబు నిర్దోషి అని చాటొచ్చు కదా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. 


రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంటే.. మరి లోకేష్ ఎందుకు ఢిల్లీనో, సింగపూరో పారిపోవడం దేనికని ఎంపీ భరత్ ప్రశ్నించారు.