The Kotipalli - Narasapur Railway line: నత్తనడకన సాగుతున్న కోటిపల్లి- నర్సాపురం కోనసీమ రైల్వేలైను కోసం రూ.300 కోట్లు కేంద్రం కేటాయించింది. దీంతో ఆర్థిక అడ్డంకులతో తీవ్ర జాప్యం జరుగుతోన్న రైల్వే లైను పనులు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. నిధుల లేమితో ఈ రైల్వే లైను పనులు ఏమాత్రం ముందుకు వెళ్లని పరిస్థితిలో ఉండిపోగా కేవలం గౌతమి, వైనతేయ, వశిష్ట నదీపాయలపై నిర్మాణం జరుపుకుంటున్న వంతెన పనులు పిల్లర్ల వరకు మాత్రమే చేరుకోగలిగాయి. ఇవి కూడా మూడు నదీపాయల్లోనూ ఇంకా పిల్లర్లు నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు భూసేకరణ నిమిత్తం పరిహారం, ఇతర సమస్యలు పనుల వేగవంతాన్ని అడ్డుపడుతుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన నిధులకు సంబందించి భూసేకరణ పూర్తిచేసిఇస్తామని చెప్పడం, అది కేవలం సర్వేలతోనే ఆగిపోవడంతో ఈప్రభుత్వ హాయంలో ఇది పూర్తికాని అంకంగా కనిపిస్తోంది.


ట్రాక్‌ నిర్మాణ పనులకు అవకాశం 
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇది ఇప్పటిలో తేలే అంశం కాకపోగా రాబోయే ప్రభుత్వంలోనే భూసేకరణ ప్రక్రియ పూర్తి అయితేనే రైల్లే లైనుకు సంబందించి ట్రాక్‌ నిర్మాణ పనులకు అడుగు ముందుకు పడే అవకాశం ఉంది.. ఇప్పుడు కేంద్రం కేటాయించిన నిధులకు సంబందించి కేవలం నదీపాయలపై పూర్తిస్థాయిలో మూడు వంతెనలు నిర్మాణానికి మాత్రమే సరిపడే అవకాశాలుండగా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కేటాయించాల్సిన నిధులు విడుదల, భూసేకరణ సజావుగా, నిర్ణీత సమయానికి పూర్తి చేస్తేనే కోనసీమ రైల్వే లైను పనులు కొంతవరకు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని రైల్వే లైను సాధన సమితి నాయకులు చెబుతున్నారు. 
ముందుకు కదలని ట్రాక్‌, మౌలిక వసతులు...
కోనసీమ వాసులు చిరకాల వాంఛ అయిన కోటిపల్లిానర్సాపురం రైల్వే లైనుకు సంబందించి ఇప్పటివరకు విదుడలైన నిధుల ద్వారా మూడు నదీపాయలపై వంతెన నిర్మాణాలకు సంబందించి పిల్లర్లకు సంబందించిన పనులు మాత్రమే జరుగుతున్నాయి.. అయితే గతేడాది బడ్జెట్టులో రూ.296.51 కోట్లు నిధులు కేంద్రం కేటాయించింది.. ఈ నిధుల ద్వారా రైల్వే ట్రాక్‌, స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పిల్లర్లు నిర్మాణం పూర్లయిన వంతెన పైభాగంలో ఐరెన్‌ రెయిల్స్‌, బాక్సు గడ్డర్లు ఇతర పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచింది.. అయితే మూడు నదీపాయలపై పూర్తయ్యిన పిల్లర్లపై ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్టులో రూ.300 కోట్లు నిధులు కేటాయించడంతో రైల్వేలైను పనులు మరింత వేగవంతం అవుతాయని కోనసీమ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. అదేవిధంగా కాకినాడాకోటిపల్లి రైల్వే ట్రాక్‌ పునరుద్ధరన కోసం మరో రూ.20 కోట్లు కేటాయించడం కూడా శుభపరిణామమే అంటున్నారు. 
ప్రస్తుతం ఎంతవరకు పనులు..
కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను 57.21 కిలోమీటర్లు దూరం కాగా ఈ రైల్వే లైను నిర్మాణ అంచనా వ్యయం రూ.2,120.16 కోట్లు గా అంచనా వేశారు. అయితే ఈపనులు నానాటికీ జాప్యం అవుతుండడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కోటిపల్లిాశానపల్లి లంక మధ్య నున్న గౌతమి నదీపాయపై 3.50 కిలోమీటర్లు మేర వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటివరకు 45 పిల్లర్లు వరకు నిర్మాణాన్ని పూర్తిచేసుకున్నాయి. ఇక వైనతేయ నదీపాయపై బోడసకుర్రు- పాశర్లపూడి మధ్య నిర్మిస్తున్న వంతెనకు సంబందించి 21 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా 16 వరకు పూర్తికాగా మరో రెండు నిర్మాణదశలో ఉన్నాయి.. వశిష్ట గోదావరి పాయపై నిర్మిస్తున్న వంతెనకు సంబందించి 20 పిల్లర్లుకు 18 పూర్తికాగా మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి.. 
భారీగా పెరిగిన అంచనా వ్యయం..
కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైను పనులు అత్యంత ఆలస్యంగా నడుస్తున్న ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 2001 డిసెంబరు నెలలో రూ.1,045.20 కోట్లుతో ఆమోదం పొందిన ఈప్రాజెక్టు షెడ్యూల్‌ ప్రకారం 2009 మార్చి నాటికి పూర్తికావాల్సి ఉంది. అయితే అనుకున్న సమయానికి ఇది ఏమాత్రం పూర్తికాకపోగా ఇప్పటికే రూ.1,141.44 కోట్లు మేర ఖర్చుచేశారు. అయినా పూర్తికాలేదు. తాజా అంచనాల ప్రకారం రూ.2,500.98 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉందని నివేదికలో తేలింది. ఇది గత అంచనాలకు 140 శాతం అధికం. 
రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏమైంది ?
ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబందించి 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వాటాగా రూ.2 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా నిధులు విడుదల కాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ రైల్వే లైనుకు సంబంధించి రాష్ట్ర వాటాగా రూ.525 కోట్లు విడుదల కావాల్సి ఉండగా కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే ఇంతవరకు విడుదల అయ్యాయి. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయలేకపోవడం వల్లనే కోనసీమ రైల్వేలైను పనులు తీవ్ర జాప్యం జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టుకు సంబందించి 190 హెక్టార్లు మేర భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, అడుగు ముందుకు పడడం లేదు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం భూసేకరణ అంశం వేగంగా జరగుతోందని, దీనికోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెబుతోంది.