Chellaboina Venugopal About Chandrababu: తూర్పు గోదావ‌రి: చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంద‌ని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. కానీ, 40 ఏళ్ల అనుభవం, దాదాపు 15 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చట్టాలను గౌరవించడం కూడా తెలియదంటూ మంత్రి మండిపడ్డారు. అనుభవం ఉంటే సరిపోదని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించకుండా గౌరవించకుండా టీడీపీ అధినేత చంద్రబాబు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే ప్రభుత్వం, పోలీసులు మాత్రం చూస్తు ఊరుకోరని చెప్పారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నారని, ఆయనకు మతిస్థిమితం తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారని, పట్టించుకోవడం మానేశారని చెప్పారు. చంద్రబాబు తాను పాలకుడిగా కాకుండా రాజులా, నియంతలా వ్యవహరించి అమరావతి రైతుల నుంచి బలవంతంగా భూమిని సేకరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. 


మాజీ సీఎం చంద్రబాబు వల్లే రైతులు నష్టపోతున్నారని, ఏ ప్రాంతాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ప్రచార యావ, ఆర్బాటంతో ఇటీవల 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రం గురించి, అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై ఫోకస్ చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మూడు రాజధానులు చేసి పరిపాలన, అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల కోసం ఆలోచిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. అనపర్తిలో సభ వద్దని, చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించవద్దని సూచించినా, ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన ఇష్టరీతిన వ్యవహరించి ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. 


తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు చినరాజప్ప, కేఎస్‌ జవహర్‌ తో సహా మొత్తం ఎనిమిది మంది నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరో 1000 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. డీఎస్పీ భక్తవత్సల ఫిర్యాదుపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్‌షో నిర్వహించడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై ఈ కేసులు నమోదు చేసినట్లు సమాచారం. శుక్రవారం అనపర్తిలో జరిగిన రోడ్‌షో, బహిరంగ సభకు పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించి చంద్రబాబును, టీడీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసుల ఆంక్షల మధ్య చంద్రబాబు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లారు. చంద్రబాబు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అడుగడుగునా పోలీసులు అడ్డుతగలడంతోపాటు చంద్రబాబు ప్రసంగించిన వాహనాన్ని ముందుకు కదలనీయకపోవడంతో మరో వాహనంపై నుంచి ప్రసంగించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.