టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పేదవారి కోసం తన పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. సామర్లకోటలో ప్రభుత్వం ఇచ్చిన గృహాలను ప్రారంభోత్సవం చేసిన ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 


రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతాల్లో కూడా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించామన్నారు సీఎం జగన్. కుప్పంలో కూడా 20 వేల మందికి సెంటు స్థలాలకు సంబందించిన పట్టాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. చంద్రబాబుకు కనీసం ఏపీలో ఇల్లు కూడా లేదని విమర్శించారు. ఆయన దత్తపుత్రుడికి కూడా నివాసం లేదని ఎద్దేవా చేశారు. ఇద్దరి శాశ్వత చిరునామా హైదరాబాద్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. 


గత 52 నెలలు కాలంలో కనీసం కంటిన్యూగా నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించని చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు, లోకేష్‌, బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్‌ విమర్శించారు. ప్యాకేజీ స్టార్‌ పోటీ చేసి ఓడిపోయిన రెండు ప్రాంతాలతో కూడా సంబంధం లేకుండా తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన భార్య మాత్రం మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతున్నారని ఘాటు కామెంట్స్ చేశారు. ఒకరు స్టేట్‌, ఒకరు నేషనల్‌, మరొకరు ఇంటర్నేషనల్‌ అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. 


పెళ్లిళ్లపై దత్తపుత్రుడికి గౌరవం లేదని... ప్రజలపై టీడీపీకి ప్రేమ లేదని విమర్శించారు జగన్. వీళ్లందరికీ అధికారం మాత్రమే కావాలన్నారు. దోచుకోవడాని, పంచుకోవడానికి తినుకోవడానికి వీళ్లకు రాష్ట్రంలో అధికారం కావాలని ఆరోపించారు. వీళ్లంతా రాష్ట్ర ప్రజలతో వ్యాపారం చేస్తున్నారని అన్నారు. వాళ్లది యూజ్ అండ్‌ త్రో పాలసీ ధ్వజమెత్తారు. 


షూటింగ్‌ గ్యాప్‌లో రాష్ట్రంలో పర్యటించే పవన్ కల్యాణ్‌.. తన పార్టీని, ఓటింగ్ శాతాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని విమర్శించారు జగన్. ఈ ప్రాంతంతో ప్రజలతో అనుబంధం లేదని వ్యక్తులు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అధికారం రాకపోయే వీళ్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయన్నారు. 
నాటి బడ్జెట్‌తోనే సంక్షేమ పాలన అందిస్తున్నామని అప్పుడు ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు. రాజకీయాలంటే విలువలు విశ్వసనీయత ఉండాలన్నారు. ఇప్పటికే తాము ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామన్నారు. లంచాలకు, వివక్షకు తావు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. దిశ యాప్‌తో మహిళలకు అండగా ఉన్నామని గుర్తు చేశారు. నాలుగేళ్లులో 2.07 ఉద్యోగాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలో 3,300 రోగాలకు చికిత్స లభిస్తోందన్నారు. 


చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయని జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకు వస్తాయన్నారు జగన్. రెండేళ్లలోనే పేదల సొంతిటి కల నెరవేర్చామన్నారు జగన్. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని... 17 వేల కాలనీలు ఏర్పాటు అవుతున్నట్టు పేర్కొన్నారు. సామర్లకోట లేఅవుట్‌లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తైందన్నారు జగన్. లక్షల విలువ చేసే ఆస్తిని పేదల చేతుల్లో పెట్టామన్నారు. తమ ప్రభుత్వంలో హయాంలో 35కుపైగా పథకాలు అమలవుతున్నాయని పేదవాడి స్థితిని మారుస్తున్నామని పేర్కొన్నారు. 


అలాంటి మంచి పేదలకు జరగకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతునత్నాయని విమర్శించారు జగన్. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.