Vijayawada News: మరో 6 నెలల్లో ఎన్నికల నగారా మ్రోగనున్న నేపథ్యంలో ఆశావహులు క్యూ కడుతున్నారు. అయితే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రిజర్వుడు స్థానం అయిన పి.గన్నవరంలో అయితే ఈ పోటీ మరింత పెరిగింది. అన్ని పార్టీల నుంచి ఆశావహులు బరిలో మేమున్నామంటే మేమున్నామని తెగ ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మరోసారి టికెట్ ఆశిస్తుండగా, అదే వైసీపీ నుంచి చాలా మంది తమ కర్ఛీఫ్‌లు వేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం కోసం వైసీపీ నుంచి అమలాపురం ఎంపీ చింతా అనురాధ చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్‌ బాగా వినిపిస్తుంది. మరో వైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా ఇదే నియోజకవర్గంలోని అయినవిల్లి జడ్పీటీసీగా ఉన్న గన్నవరపు శ్రీనివాసరావు కూడా అంతే స్థాయిలో టిక్కెట్టు దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమలాపురం నియోజకవర్గానికి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు శ్రీకాంత్‌ కూడా అమలాపురంలో అవకాశం రాకుంటే పి.గన్నవరం తనకు ఇవ్వాలన్న ప్రపోజల్‌ కూడా పెట్టినట్లు తెలుస్తోంది..


పొత్తు ఉన్నా ఎవరి ప్రయత్నాల్లో వారు..


తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని పోటీలో దిగే అవకాశం ఉన్నా పి.గన్నవరం నియోజకవర్గం నుంచి అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నుంచి ఆశావహులు మాత్రం తెగ వరుస కడుతున్నారు. టీడీపీ నుంచి నియోజకవర్గ బాద్యతలు స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్‌ మాధుర్‌ బాలయోగి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఇంఛార్జీని నియమించకపోగా రాజోలు గనుక జనసేనకు కేటాయిస్తే అక్కడి మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక జనసేన నుంచి అయితే ఒక పోలీసు అధికారి తన పదవికి వాలంటీర్‌ టిటైర్మెంట్‌ తీసుకుని మరీ బాగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక మరో ఎన్‌ఆర్‌ఐ కూడా తనకు కానీ, తన భార్యకు కానీ జనసేన పార్టీ తరఫున టిక్కెట్టు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతకు పి.గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేన రంగంలోకి దిగుతుందా అన్నది క్లారిటీ లేకపోయినా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోతున్నారు.


గల్లంతయ్యేది ఆయన పేరేనా..


గెలుపు గుర్రాలకే టిక్కెట్టు ఇస్తారని, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వే చేయించి నివేదిక రప్పించుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో ఏ మాత్రం రిస్క్‌ చేయరన్నది నిజం అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే పి.గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు మాత్రం అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టలేకపోయారని ప్రచారం జరుగుతోంది.