Gorantla Butchaiah Chowdary: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైఎస్ జగన్ నాలుగేళ్ల పాలనలో విధ్వంసం పెరిగిపోయిందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి అరాచకాలకు రాష్ట్ర ప్రజలు సెలవు చెప్పాలని చూస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.


'జగన్‌కు మళ్లీ పెళ్లి గుర్తుకొచ్చింది'


సీఎం జగన్ కడప స్టీల్ ప్లాంట్ కు మూడోసారి శంకుస్థాపన చేశారని గోరంట బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డికి మళ్లీ పెళ్లి గుర్తుకు వచ్చిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థను, మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని గోరంట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ భరత్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని వదిలేసి రాజమహేంద్రవరం నియోజకవర్గానికే పరిమితం అయ్యారని విమర్శించారు. మహానాడు బ్యానర్లు కట్టుకుంటే మధ్యలో ఎంపీ భరత్ దూరి వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్నారని అన్నారు. తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారని గోరంట్ల చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంలో అధికారులతో కలిసి ఎంపీ ఆటలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు చుట్టూ లేకుండా వైసీపీ నేతలు ఎవరైనా బయటకు రాగలరా అంటూ సవాల్ విసిరారు. 


Also Read: Kesineni : కేశినేని నోట ఇండిపెండెంట్‌గా పోటీ మాట - టీడీపీ టిక్కెట్ ఇవ్వదని డిసైడయ్యారా ?


'ఆతిథ్యం ఇవ్వడంలో టీడీపీని మించింది లేదు'


ఇటీవల రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆతిథ్యం ఇవ్వడంలో తెలుగు దేశం పార్టీని మించింది లేదని అన్నారు. టీడీపీ తొలి విడత మేనిఫెస్టోని ప్రజలు ఆదరిస్తారని.. దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో వస్తుందని చెప్పారు. 


'అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ'


మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపైనా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ రెడ్డి కేసు విషయం బ్రేకులు పడుతూనే ఉందని ఆరోపించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తారా అని గోరంట్ల నిలదీశారు. అవినాష్ రెడ్డి కేసు అంతులేని కథ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 


Also Read: Balineni : బాలినేనికి సీఎం జగన్ పిలుపు - మళ్లీ కీలక బాధ్యతలిస్తారా ?


అవినాష్‌కు  బెయిల్- న్యాయం, ధర్మం తేలింది: సజ్జల


వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. న్యాయం, ధర్మం తేలిందని వ్యాఖ్యానించారు. బెయిల్, ముందస్తు బెయిల్ అనేది సాధారణంగా జరిగేదే అని.. కానీ అవినాష్ రెడ్డి అంశంలో వచ్చిన తీర్పు ప్రత్యేకమని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి ఓ వర్గం మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం జరుగుతున్నట్లు చెప్పారు. కొందరు వ్యక్తులు న్యాయమూర్తులపైనా కామెంట్ చేస్తున్నారని తెలిపారు. సీబీఐ విచారణను సైతం ప్రభావం చేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. నిజాయితీపరులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కోర్టులు టీడీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్లా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.