MP Margani Bharath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విలువలు, విశ్వనసీయత లేవని.. అవే ఉంటే ఢీల్లీ పెద్దలు కలిసేవారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. నేతలను కలిసేందుకు వెళ్లి పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అజెండా మోయడానికే జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారనే విషయం ప్రజలకు అర్ధమవుతుందన్నారు. నేతల అపాయిట్‌మెంట్ దొరక్క మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారున్నారని వైసీపీ ఎంపీ విమర్శించారు.
పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. బీజేపీ పెద్దలను గతంలో పాచిపోయిన లడ్డూలని, అవి మాకు అవసరం లేదని చెబుతూ జనసేనాని బయటకు వచ్చారని గుర్తు చేశారు. ఏ సఖ్యత కుదిరిందని బీజేపీతో పవన్ కల్యాణ్ కలిశారని ప్రశ్నించారు. అలాగే గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేశాడని పవన్ కల్యాణ్ దుమ్మెత్తిపోశారని.. మరి ఇప్పుడెలా స్నేహం కుదిరిందని జనసేనానిని ఎంపీ భరత్ ప్రశ్నించారు.
చంద్రబాబు అజెండా మోయడమే పని..
టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా మోయడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఆయన్ను కలుస్తూ ఉన్నారని ఎంపీ భరత్ విమర్శించారు. వైసీపీ దగ్గర ముసుగులో గుద్దులాటలు ఉండవన్నారు. ఏదైనా చేస్తామని చెప్పామంటే చేస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా చెబుతా ఉన్నామని అన్నారు. గతంలో రైతు రుణమాఫీ చేయలేమని చెప్పామని.. చంద్రబాబు చేస్తానని చెప్పి చేయలేకపోయాడని గుర్తు చేశారు. విశ్వసనీయతకు, విలువలకు నిలువుటద్దం జగన్ మోహన్ రెడ్డి అని ఎంపీ భరత్ వివరించారు. ఈ పవన్ కల్యాణ్ ఈ రోజు మాట్లాడే మాటకు రేపు మాట్లాడే మాటకు ఏమాత్రం పొంతన ఉండదంటూ ఎద్దేవా చేశారు. విశ్వసనీయత అనే పదం చంద్రబాబుకు కానీ, పవన్ కల్యాణ్‌కు కానీ మచ్చుకైనా కనబడడం లేదని విమర్శించారు.
మిత్రధర్మాన్ని పవన్ విస్మరించారు..
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు మిత్రపక్షమని చెబుతున్నారు. అక్కడ మాధవ్ అని సిట్టింగ్ ఎమ్మెల్సీ మళ్లీ పోటీ చేస్తే మిత్రపక్షం కింద ఉన్న జనసేన మిత్ర ధర్మం పాటించాల్సింది పోయి కనీసం పట్టించుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్ షూటింగ్ ల బిజీ అయితే కనీసం కార్యకర్తల ద్వారా అయినా మద్దతు తెలపాలని చెప్పుకొచ్చారు. అది కూడా చేయలేదని స్వయంగా మాధవ్ బాధపడిన సందర్భం ఉందని తెలిపారు. ఢిల్లీ వెళ్తున్న పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత అనేది లేదని, అందుకే ఢిల్లీలో బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. మీ వెనుక తిరుగుతున్న ఫ్యాన్స్ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. విలువలు విశ్వసనీయత లేకపోతే ఢిల్లీ పెద్దలు కూడా ఎందుకు మీకు విలువ ఇస్తారన్నారని ప్రశ్నించారు. మిత్రధర్మం అలియన్స్‌లో ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించాలని సూచించారు. తెలుగోడిగా ఢిల్లీలో పడిగాపులు కాస్తుంటే మీ ఫ్యాన్స్ పరువు తీస్తున్నారని ప్రజలకు అనిపిస్తుందని విమర్శించారు. అది గమనించుకుంటే మంచిదని ఎంపీ భరత్ హితవు పలికారు.