Konaseema News : పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పడుతుందన్న ఆరోపణలు ఈనాటివి కావు.. కాకినాడ పోర్టు కేంద్రంగా వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం విదేశాలకు ఎగుమతులు అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు ఆకస్మిక తనిఖీతో ఒక్కసారిగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై దుమారం రేగింది.. అయితే వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ పరిస్థితిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తామని అటు సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ తీవ్రంగా చెప్పారు. చెప్పిన విధంగానే సివిల్ సప్లై మినిష్టర్ జనసేన నేత అయిన నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. ఆయన కూడా పలుసార్లు కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టి కొంతమేరకు అక్రమంగా రవాణా అవుతున్న పీడీఎస్ బియ్యం సీజ్ చేయించారు..
తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పాత పద్దతిలోనూ జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల వద్దనే రేషన్ ఇచ్చేలా మార్పులు చేసింది. నెలలో ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ డిపోల వద్దనే ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియను జూన్ ఒకటి నుంచి ప్రారంభించింది.. సరిగ్గా అదే రోజు కోనసీమలో ఓ ట్రాక్టర్‌లో తరలిస్తున్న పీడీఎస్ అక్రమ రవాణాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్ని పటిష్టమైన చర్యలు చేపట్టినా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగలేదన్నది స్పష్టం అయ్యింది..
మొదటి రోజే పట్టుబడిన పీడీఎస్ బియ్యం..
రేషన్‌షాపులు ప్రారంభించిన మొదటి రోజే అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో ఓ రేషన్ డిపో నుంచి 40 బస్తాలు ట్రాక్టరులో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పట్టుకున్నారు. నలుగురిపై 6ఏ కేసుతోపాటు పోలీస్ కేసు కూడా నమోదైంది. ట్రాక్టరులో తరలిస్తున్న 40 రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేషన్ షాపులు ప్రారంభం రోజునే 40 బస్తాల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోవడం చాలా దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా ఇలా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేస్తున్నారు.