ఓ వ్యాపారవేత్తకు ఇంతవరకు పెళ్లి కాలేదు. ఇప్పటి వరకు పెళ్లి చేసేకోవాలనే ఆలోచన రాలేదు. ఇప్పుడు పెళ్లిపై మనసు మళ్లింది. అంతే సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఇంతలో తెలిసిన వ్యక్తి మంచి ఉందని చెప్పి ఫొటోలు చూపించింది. మంచిదే కదా అని నిశ్చితార్థం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తెలిసింది అదంతా ఓ ప్లాన్ ప్రకారంజరిగిన మోసమని. ఇప్పుడా వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 


కాకినాడకు చెందిన టి.కృష్ణమోహన్‌ వ్యాపారవేత్త. సామాజిక సేవ కూడా చేస్తుంటారు. సరైన సమయంలో వివాహ కాలేదు. ఇన్ని రోజుల ఆలోచన కూడా చేయలేదు. ఇప్పుడైనా ఒక తోడు ఉంటే మంచిదని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతే పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారందరికీ విషయాన్ని చెప్పారు. ఈ క్రమంలోనే పెళ్లిళ్ల మధ్యవర్తి రాజమండ్రికి చెందిన శిరీష తగిలారు. 
కృష్ణమోహన్‌తో మాట్లాడిన శిరీష తన వద్ద చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓ అందమైన ఫొటో కూడా చూపించారు. చూడటానికి అమ్మాయి బాగుంది. మంచి సంబంధం అంటున్నారు. మంచి ఫ్యామిలీ అంటున్నారు. అందుకే సంబంధాన్ని ఓకే చెప్పారు కృష్ణమోహన్. 


ఆ అమ్మాయితో మాట్లాడాలని శిరీష చెప్పడంతో ఆమెతో కూడా మాట్లాడారు కృష్ణమోహన్. ఆమె కూడా పెళ్లి ఓకే చెప్పంది ఇంకేం ఉంది మంచి ముహూర్తం అనుకొని ఒకరినొకరు చూసుకందామని అనుకున్నారు. ఇక్కడేతెలివిగా వ్యవహరించిన శిరీష అదే రోజు నిశ్చితార్థం కూడా జరిపిద్దామని చెప్పేసింది. ఆలస్యమైతే సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చింది. 


ఈ క్రమంలోనే రాజమండ్రి శివారు నామవరం తీసుకెళ్లి నిశ్చితార్థం జరిపించేశారు. కొన్ని రోజుల తర్వాత వేర్వేరు సమస్యలు ఉన్నాయని చెప్పి రెండుసార్లు ఆరు లక్షలు  ఇచ్చారు కృష్ణమోహన్. బంగారం, సెల్‌ఫొన్‌ గిఫ్టుగా ఇచ్చాడు. పెళ్లి ముహూర్తం అంటే మాత్రం ఆ అమ్మాయి ఇప్పట్లో పెళ్లి వద్దని చెబుతూ వస్తోంది. 


కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అందుబాటులోకి రావడం లేదు. అనుమానం వచ్చిన కృష్ణమోహన్ అప్పుడు ఎంక్వయిరీ మొదలు పెట్టాడు. విచారించిన ఆయనకు మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు తెలిశాయి. తనకు ఫొటోలో చూపించిన అమ్మాయే లేదని తేలింది. ఫేక్ ఫొటోలతో తను మోసపోయినట్టు గ్రహించారా వ్యక్తి. 


తనకు చూపించి నిశ్చితార్థంచేసుకున్న వ్యక్తి గురించైనా కనుక్కుందాని వెళ్తే అక్కడ మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. తనకు చూపించిన ఆమె పేరు నీరజ అని. ఆమెకు ఇది వరకే పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నట్టు తేలింది. ఇవన్నీ తెలిసిన తర్వాత పట్టలేనంత ఆగ్రహంతో మధ్యవర్తిగా ఉన్న శిరీషకు కాల్ చేస్తే ఆమె ఫోన్ నెంబర్ స్విచ్ఛాఫ్ వస్తోంది. 
పెళ్లై ఓ బిడ్డకు తల్లిగా ఉన్న మహిళను తనకు చూపించి తనను శిరీష మోసం చేసిందని ఆలస్యంగా తెలుసుకున్న కృష్ణమోహన్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిందంతా చెప్పుకొచ్చారు. తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. 


కేసు నమోదు చేసిన పోలీసులు...
వివాహం పేరుతో తనను మోసం చేశారని కాకినాడ వన్‌టౌన్‌ పోలీసులను కృష్ణమోహన్‌ ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఉదంతంలో ఆరుగురు మహిళలు ప్లాన్‌ ప్రకారం తనను మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్దనుంచి రెండు దఫాలుగా ఆరు లక్షలు రూపాయలు, బంగారం, సెల్‌ఫోన్లు తీసుకున్నారని వాపోయారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


లేటు వయస్సులో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి ఆకాంక్షను సొమ్ము చేసుకోవాలని ప్లాన్‌ వేసి వ్యక్తి ఓ బిడ్డకు తల్లితో నిశ్చితార్ధం జరిపించింది.  ఆపై పత్తాలేకుండా పోయిన ఈ ఘటన కాకినాడలో కలకలం రేపుతోంది.