NTRUHS MBBS, BDS Admissions 2024: ఏపీలోని మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 9న విడుదల చేసింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సీట్ల భర్తీకి మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధికారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కాలేజీల్లో EWS కోటా అమలు చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 1 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని ఆమె పేర్కొన్నారు. సీట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని రిజిస్ట్రార్ సూచించారు.
జాతీయ స్థాయిలో నీట్ యూజీ-2024 ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా తాజాగా.. ఏపీలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీరాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాలు ప్రకటించింది. ఏపీలో మొత్తం 43,788 మంది ర్యాంకులను వర్సిటీలు ప్రకటించింది. ఇక కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 35 మెడికల్ కాలేజీల్లో మొత్తం 6,210 ఎంబీబీఎస్ సీట్లను.. 1,540 బీడీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. దేశంలో ఉన్న మొత్తం 710 మెడికల్ కాలేజీల్లో దాదాపు 1.10 లక్షల మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు బీడీఎస్. ఆయుష్, నర్సింగ్ విభాగాల్లో 21 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మర్‌లోని ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్లనున్నారు.
* ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు
నీట్ యూజీ - కటాఫ్ మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్-162 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 పర్సంటైల్-127 మార్కులు, ఓసీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు 45 పర్సంటైల్-144 మార్కులుగా నిర్ణయించారు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓసీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు ఉండాలి. నీట్ యూజీ 2024 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2360 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజులకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనం. డెబిట్/క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆలస్యరుసుముతో దరఖాస్తు చేసుకునేవారు రూ.20 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజు వివరాలు..
➥ ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా (కేటగిరీ-ఎ) ఫీజు కింద ఏడాదికి రూ.15,000, సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రవేశం పొందినవారు రూ.12,00,000 చెల్లించాలి. ఇక ఎన్నారైలు అయితే రూ.20,00,000 చెల్లించాల్సి ఉంటుంది.
➥ తిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీ(ఉమెన్)లో సీటు పొందినవారు కన్వీనర్ కోటా కింద రూ.60,000 చెల్లించాలి.
➥ ప్రభుత్వ డెంటర్ కళాశాలలో బీడీఎస్ సీటు పొందిన వారు రూ.9000 చెల్లించాలి.
➥ ప్రైవేటు అన్ ఎయిడెడ్ మైనారిటీ, నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా (కేటగిరీ-ఎ) ఫీజు కింద ఏడాదికి రూ.16,500, మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లు (కేటిగిరీ-బి) పొందినవారు రూ.13,20,000 చెల్లించాలి. ఇక ఎన్నారైలు అయితే రూ.39,60,000 చెల్లించాల్సి ఉంటుంది.
➥ ప్రైవేటు అన్ ఎయిడెడ్ మైనారిటీ, నాన్-మైనారిటీ డెంటల్ కాలేజీలో బీడీఎస్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా (కేటగిరీ-ఎ) ఫీజు కింద ఏడాదికి రూ.14,300, మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లు (కేటిగిరీ-బి) పొందినవారు రూ.4,40,000 చెల్లించాలి. ఇక ఎన్నారైలు అయితే రూ.13,20,000 చెల్లించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లను కేటాయించారు. ఇక సమాంతర రిజర్వేషన్ల కింద మహిళలకు మొత్తం సీట్లలో 33 శాతం రిజర్వేషన్ కోటాను అమలుచేయనున్నారు. స్పెషల్ కేటిగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సీట్లను కేటాయిస్తారు.
ALSO READ: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్‌కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ నీట్ యూజీ 2024 ర్యాంకు కార్డు
➥ పుట్టిన తేదీ ధ్రవీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో
➥ ఇంటర్ మార్కుల మెమో
➥ 6 నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు
➥ ఇంటర్ రెండు సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
➥ తాజాగా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైన కేటగిరీలకు)
➥ మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లింలకు)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2024-25)
➥ తల్లిదండ్రులకు సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు
➥ PwBD సర్టిఫికేట్ (దివ్యాంగులకు)
➥ NCC, CAP, PMC, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డు
➥ లోక్ స్టేటస్ సర్టిఫికేట్
➥ అభ్యర్థుల పాస్ పోర్ట్ సైజు ఫొటోలు
➥ అభ్యర్థుల సంతకం
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 09.08.2024
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.08.2024
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2024
➥ రూ.20 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం: 19.08.2024 09.00 AM నుంచి ప్రొవిజినల్ మెరిట్ జాబితా ప్రకటించే వరకు.
➥ అభ్యర్థుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడి తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
➥ అభ్యర్థుల ఫైనల్ మెరిట్ జాబితా వెల్లడి తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
➥ సీట్ల కేటాయింపు: తర్వాత ప్రకటిస్తారు.
➥ తరగతులు ప్రారంభం: ఎన్‌ఎంసీ/ డీసీఐ షెడ్యూలు ప్రకారం.
➥ ప్రవేశ ప్రక్రియ ముగింపు: ఎన్‌ఎంసీ/ డీసీఐ షెడ్యూలు ప్రకారం.