Godavari Floods: గోదావరి ఉగ్రరూపంతో ఉరకలెత్తి ప్రవహిస్తోంది.. ఎగువ నుంచి వస్తోన్న వరదతో భధ్రాచలంవద్ద గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది.. ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 50.60 అడుగులకు చేరగా అది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో దిగువకు వచ్చిపడుతున్న భారీ వరదతో ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద రికార్డుస్థాయిలో వరదనీరు వచ్చిచేరుతోంది.. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద 14.30 అడుగులస్థాయి నీటిమట్టంకు చేరుకోగా దిగువన సముద్రంలోకి బ్యారేజ్‌ 175గేట్లను ఎత్తి యథాతధంగా 13,80,366 లక్షల క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు జలవనరుల శాఖ అధికారులు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరద పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. 


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హై అలెర్ట్‌..


ధవళేశ్వరం నుంచి 13 లక్షలకు పైబడి వరదనీటిని దిగువకు వదులుతుండడంతో దిగువనున్న గౌతమి, వశిష్ట, వృద్దగౌతమి, వైనతేయ నదీపాయలు భీకరంగా మారాయి.. భారీ వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి.. దీంతో కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఉదయం 6గంటలకు అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల్లో పలు లంక గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. బలహీనంగా ఉన్న ఫ్లడ్‌ బ్యాంక్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పత్యేకాధికారులను నియమించారు. అవుట్‌ఫాల్‌ స్లూయీజ్‌లు, బలహీన ఏటిగట్లు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వినాయక నిమజ్జనాలకు సంబందించి నిమజ్జన పాయింట్లు ఏర్పాటుచేసి సురక్షితమైన ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు..వరద ప్రభావంతో ఫెర్రీ పాయింట్లు మూసివేశారు. వరద ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతాలుగా మల్కిపురం, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు.. 


Also Read: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ


కాజ్‌వేలపై ఉద్దృతంగా వరదనీరు..


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కనకాయిలంక, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజ్‌వేలుపై వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో ఈప్రాంతాల్లో ప్రజలు రాకపోకలు సాగించేందుకు అధికారులు మెకనైజ్డ్‌ బోట్లును ఏర్పాటు చేశారు. ఎవ్వరూ కాజ్‌వేలపై వాహనాలతో దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. అదేవిధంగా అయోధ్యలంక, బూరుగపూడిలంక, అప్పనపల్లి, పెదపట్నంలంక, అయినవిల్లి, ఠాణేల్లంక తదితర ప్రాంతాల్లో ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశించారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో అంతటా కురిసిన భారీ వర్షాలు, అక్కడ తప్ప! భవిష్యత్ మరింత భయానకం