Yuvagalam: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి యువగళ పాదయాత్ర మొదలై.. ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పిల్ల కాలువలా మొదలై ఉద్ధృత ప్రవాహంలా సాగుతున్న యువగళం పాదయాత్ర చేపట్టిన యువనేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయింది అంటూ బాబు అభినందించారు.
రాఖీ పౌర్ణమి వేళ ఈ ప్రత్యేక సందర్భం రావడంతో టీడీపీ శ్రేణులు మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో సాగుతున్న పర్యటనలో.. దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. రక్షా బంధన్ సందర్భంగా యువనేతకు రాఖీలు కడుతూ జైత్రయాత్రలో కలిసి నడుస్తున్నారు. యువగళం 200వ రోజు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈ రోజు నందమూరి కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొననున్నారు. పోలవరంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కొద్ది సేపు నారా లోకేష్ తో పాటు కలిసి నడవనున్నారు.
200 రోజులుగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పటి వరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 16 వందలకుపైగా గ్రామాలను, సుమారు రెండు వందల వరకు మండలాలు, మున్సిపాలిటీలు కవర్ చేశారు. మొత్తంగా 2,710 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు.
పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45 రోజులు సాగింది పాదయాత్ర. అనంతపురం జిల్లాలోని 9నియోజకవర్గాల్లో 23 రోజులు యాత్ర చేశారు. కర్నూలు జిల్లాలోని 14నియోజకవర్గాల్లో 40రోజులపాటు నడిచారు లోకేష్. కడప జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 16 రోజులు సాగింది. నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 31 రోజులు, ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 17రోజులుపాటు ప్రజల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాలోని 7 నియోజక వర్గాల్లో 16రోజులు, కృష్ణాజిల్లాలోని 6 నియోజకవర్గాల్లో 8 రోజులు సాగింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్‌నాలుగు రోజుల్లో 2 నియోజకవర్గాల్లో టూర్ చేపట్టారు.
రెండు వందల రోజుల పాటు ప్రజల్లోనే ఉన్న లోకేష్... 60కిపైగా బహిరంగ సభల్లో మాట్లాడారు. వందకుపైగా ఇంటరాక్టివ్ భేటీల్లో పాల్గొన్నారు. స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారో లోకేష్ చెబుతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల వద్ద సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వానికి ఛాలెంజ్‌లు చేశారు. సమస్యలను ఎత్తి చూపుతూ కూడా సల్ఫీలు దిగారు.
గతంలో లోకేష్ మాట్లాడితే విపరీతంగా ట్రోల్స్ వచ్చేవి. ప్రత్యర్థులు ఆయన మాటాల్లోని తప్పులను ఎత్తి చూపుతూ విమర్శలు చేసేవాళ్లు. పాదయాత్రలో లోకేష్ మాట తీరు మారింది. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్‌లతో విరుచుకుపడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలను, టీడీపీ శ్రేణులను వేధిస్తోందని తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిని వదిలి పెట్టబోమంటూ హెచ్చరిస్తున్నారు. రెడ్ డైరీని పట్టుకొని వారి పేర్లు రిజిస్టర్ చేస్తున్నామంటూ ఊరూరా చెబుతున్నారు.