Pithani Satyanarayana : వైసీపీ ప్రభుత్వ బెదిరింపుల కారణంగానే ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికలలో దూరంగా  ఉంటానని అనడానికి కారణమని టీడీపీ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.  రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్  సంస్థ  ప్రతినిధి కావడంతో  జయదేవ్ ను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇదే రౌడీయిజం కొనసాగితే  పరిశ్రమలే కాదు రాజకీయనాయకులు  దూరమయ్యే  ప్రమాదం  ఉందన్నారు. రాష్ట్రంలో  వైసీపీ బలంగా ఉంటే నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు సస్పండ్ చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  మాకు ఉన్న 23  ఎమ్మెల్యేల ఓట్లు  మాకే వచ్చాయన్నారు. ఎటువంటి  నోటీసులు ఇవ్వకుండా నలుగురు ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్  చేస్తారని నిలదీశారు. నాలుగు గోడల మధ్య  ఎమ్మెల్యేలను బెదిరించి పబ్బం గడపాలని చూస్తే  దూరమయ్యే  పరిస్థితి  ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి  వస్తే సంక్షేమ పథకాలు  కొనసాగించే ఆలోచన చేస్తామన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో  కమిటీ సంక్షేమ పథకాలపై  కసరత్తు చేస్తుందన్నారు. మంత్రి ధర్మాన ప్రసాద్ వైసీపీ  అధికారంలోకి  రాకపోతే సంక్షేమ పథకాలు  నిలిచిపోతాయని చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు. మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో  వైసీపీ చెప్పాల్సిన అవసరంలేదన్నారు. కలిసి వచ్చే పార్టీలతో  వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటామన్నారు.