Southwest Monsoon: నైరుతి రుతుపవనాల తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో విస్తరించడంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో శుక్రవారం తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 4 నాటికి ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల సూచన, వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర భారతదేశ ద్వీపకల్పం 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి గాలుల సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగి బలహీన పడింది. తూర్పు పడమర ద్రోణి ఇప్పుడు పంజాబ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ ఒడిశా తీరం నుంచి హరియాణా, దక్షిణ ఉత్తర ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం మధ్య తీర ప్రాంత ఒడిశా, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు గోదావరి, యానాం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జిల్లాల్లోని కొన్ని చోట్ల మాత్రం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. రేపు, ఎల్లుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవనున్నాయి. కృష్ణా జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.
హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో రాత్రి వేళ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. నేడు సైతం వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.
Also Read: Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి