BJP National Executive Meeting In Hyderabad: ఎప్పుడైతే బీజేపీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచిందో ఇక అప్పటి నుంచి మాంచి రాష్ట్రంలో పార్టీ ఫామ్‌లోకి వచ్చింది. దీనికి తోడు రాష్ట్రానికి చెందిన బండారు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి వంటి వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంతో తెలంగాణపై పట్టుసాధించే ప్రయత్నం చేసింది బీజేపీ అధిష్టానం. ఈ ఊపులో మరింతగా పనిచేసిన బీజేపీ శ్రేణులకు దుబ్బాక బైపోల్ ధీమానిచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌ రావు గెలుపు పార్టీలో జోష్‌ నింపింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో అధికారపార్టీకి గట్టి పోటీనివ్వడంతో ఇక కమలానికి కొండంత బలం పెరిగినట్టైంది. ఇది చాలదన్నట్లు సీఎం కీసీఆర్‌కు దూరమై పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఈటల రాజేందర్ గెలుపు కూడా బీజేపీకి కలిసొచ్చింది. తెలంగాణ డిక్లరేషన్, టార్గెట్ సీఎం కేసీఆర్‌గా బీజేపీ తమ ప్లీనరీని హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


బీజేపీకి అన్ని మంచి శకునములే.. 
ఇలా గత కొంతకాలంగా పార్టీకి అన్నీ కలిసిరావడంతో తెలంగాణలో బలమైన పార్టీగా నిలవాలన్న కాంక్ష కమలనాథుల్లో పెరిగిపోయింది. వీటికి తోడు సీఎం కేసీఆర్ తీరు కూడా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రెచ్చగొట్టింది. ఎలాగైనా సరే తెలంగాణలో అధికార పార్టీని దెబ్బతీయాలన్న కసితో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యూహరచన చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. వీళ్లు పూర్తిగా ఫోకస్ చేస్తే అవతలి వాళ్ల పని అవుట్‌ అన్న విషయం చెప్పాల్సిన పనిలేదని గ‌త సంఘ‌ట‌న‌లు రుజువుచేశాయి. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నామమాత్రంగా తయారైంది.


ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా.. 
ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవానే కొనసాగుతోంది. ఇప్పుడు దక్షిణాదిన కూడా బలంగా ఎదగాలనుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకని హస్తగతం చేసుకుంది. తెలంగాణని కూడా అడ్డాగా మార్చుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్‌ లో జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసిందన్న విష‌యాన్ని బీజేపీ నేతలు కూడా కొట్టిపారేడం లేదు. థర్డ్‌ ఫ్రంట్‌, జాతీయ పార్టీ ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్‌కు బీజేపీ సామ‌ర్థ్యం ఏమిటో చూపించాలనే ప్రయత్నమే ఈ సమావేశాలన్న టాక్‌ నడుస్తోంది. 


తెలంగాణ డిక్ల‌రేష‌న్..
ఈసారి హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌బోతున్న జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో అనేక అంశాల‌తోపాటు తెలంగాణ‌పై డిక్ల‌రేష‌న్ కూడా చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో హైద‌రాబాద్ లో జ‌రిగిన (2004 వైశ్రాయ్ హోటల్ ) జాతీయ కార్య‌వర్గ స‌మావేశాల్లోకూడా ముంద‌స్తుకు పోతున్నామ‌ని ప్ర‌క‌టించింది ఇదే హైద‌రాబాద్ లో క‌నుక ఈసారి జ‌ర‌గ‌బోయే స‌మావేశాల్లో తెలంగాణ‌కు సంబంధించి అంశం త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంద‌ని నేత‌లు భావిస్తున్నారు. 


టార్గెట్ కేసీఆర్ అండ్ కో..  
జూలై 2, 3 జరిగే ఈ రెండు రోజుల సమావేశాల్లో పార్టీని బలోపేతం చేసే అంశాలకన్నా సీఎం కీసీఆర్‌, అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీని అడ్రస్‌ లేకుండా చేయాలన్న ప్లాన్‌ ని అమలు చేయబోతోందన్న వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా వ్యూహాలకు కేసీఆర్‌ నమో నమః అంటారా లేదంటే దొర దెబ్బకు బీజేపీ పార్టీ తెలంగాణకి బైబై చెప్పేస్తుందా అన్నది వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌ తేల్చుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 
Also Read: High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌ 


Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !