Rains in AP and Telangana | హైదరాబాద్ / అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైంది.
వర్ష సూచన ఉండటంతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పంట దిగుబడి ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో నిల్వ ఉంచాలని సూచించారు. బుధవారం, గురువారాల్లో వాతావరణం ఎలా ఉండనుంది, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది రోణంకి కూర్మనాథ్ వివరించారు. మోస్తరు వర్ష సూచన ఉన్న జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీలో బుధవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
నవంబర్ 14న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. వీటితో పాటు అల్లూరి సీతారామ రాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి.
తెలంగాణలో వాతావరణం ఇలా..
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుంది. హైదరాబాద్ లోనూ వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. తెలంగాణలో గరిష్టంగా ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ లో 33.4 డిగ్రీలు, మిగతా అన్ని జిల్లాల్లో 30 నుంచి 31.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
రాత్రివేళ అత్యల్పంగా మెదక్ లో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 15.2 డిగ్రీలు, పటాన్ చెరులో 17.2, నిజామాబాద్ లో 18.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అయితే అల్పపీడనం ప్రభావంతో ఒక్కసారిగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.