Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం అసని తుఫాన్‌గా మారింది, నేడు తుఫాన్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అసని తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. అండమాన్ దీవి పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ ఈశాన్యంగా, అండమాన్ దీవులలోని మయబందర్‌కు 120 కి.మీ ఆగ్రేయంగా, మయన్మార్ లోని యంగూన్‌కు దక్షిణ, నైరుతి వైపు 560 కి.మీ దూరంలో తుఫాన్ ప్రస్తుతం ప్రభావం చూపుతోంది. ఉత్తర మయన్మార్ తీరానికి మార్చి 23న చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.  


దక్షిణ బంగాళాఖాతంలో ఆరు రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి, అసని తుఫాన్‌గా మారింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముంద్రం మీదగా కదులుతోంది. ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి కేంద్రం, హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..- (Temperature in Andhra Pradesh)
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అసని తుఫాన్ నేపథ్యంలో మరోవైపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని వాతావరశాఖ హెచ్చరించింది. ఎండలు, ఉక్కపోత నుంచి ఉత్తర కోస్తా, యానాం ప్రజలకు కాస్త ఊరట లభించింది. 


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
అసని తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల నేడు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురం జిల్లాలోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాలు ముఖ్యంగా మదనపల్లి పరిసరాల్లో ఎక్కువ వర్షాలుంటాయి. నెల్లూరు జిల్లాలో ఉరుములతో కూడిన వర్ష సూచన ఉంది. పొదల్కూరు-ఆత్మకూరు మధ్యలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఏపీ వెదర్ మ్యాన్. 






తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
తెలంగాణలో కొన్ని చోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎండల నుంచి ఉపశమనం కలిగినట్లు కనిపిస్తున్నా ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. నల్గొండలో పగటి ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 39.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 38 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో నల్గొండ ఒకటిగా భారీ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. 
Also Read: Gold-Silver Price: నేడు మళ్లీ ఎగబాకిన బంగారం ధర, వెండి కూడా - ఎంత పెరిగిందంటే