కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో  పరిస్థితిని మార్చాలని రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న రాష్ట్రాల్లో  గ్రూపు తగాదాలను దాదాపుగా పరిష్కరించిన రాహుల్ గాంధీ పార్టీ యాక్టివ్‌గా లేని రాష్ట్రాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీ రాజకీయాలపైనా ఆయన చర్చలు ప్రారంభిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూండటం .. కనీస ఓటు బ్యాంక్ కూడా లేకపోవడంపై ఆయన దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి సన్నాహాలు  చేసుకుంటున్నారు.  పీసీసీ అధ్యక్షుడ్ని మార్చాలని అనుకుంటున్నట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.  


కాంగ్రెస్‌కు అండగా ఉన్న వర్గాలన్నీ వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్..!


ఆంధ్రప్రదేశ్‌లో  కాంగ్రెస్ ఒకప్పడు బలంగా ఉండేది. రాష్ట్ర విభజన కారణంగా...  వైఎస్ కుమారుడైన జగన్ వేరే పార్టీ పెట్టుకోవడం కారణంగా ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం ఇతర పార్టీలకు తరలిపోయింది. రాష్ట్ర విభజన కన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం ద్వారానే కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోయింది. కాంగ్రెస్ క్యాడరే కాదు.. లీడర్లు కూడా జగన్ వెంట వెళ్లిపోయారు. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే అనుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ మద్దతుగా నిలిచే దళిత, మైనారిటీ, రెడ్డి వర్గాలు వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలుకుతున్నాయి. దీంతో అసలు ఏపీలో కాంగ్రెస్‌కు ఓటుబ్యాంక్ లేకుండా పోయింది. 


ఎంత ప్రయత్నించినా మెరుగపడని ఏపీ కాంగ్రెస్ పరిస్థితి..!


కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ని మెరుగుపర్చడానికి రాహుల్ గాంధీ మొదట్లో ప్రయత్నించారు. రఘువీరారెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేశారు. కానీ ఆయన వల్ల కాలేదు. దాంతో ఆయన రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకుని తన ఊళ్లో ఆలయం కట్టడంలోబిజీ అయిపోయారు. ఈ కారణంగా ఆయన స్థానంలో సాకే శైలజానాథ్‌ను నియమించారు. కానీ పార్టీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. అప్పుడప్పుడు ప్రెస్‌మీట్లు... ఏఐసీసీ పిలుపునిచ్చే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం తప్ప కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే అవకాశం వారికి రాలేదు. మధ్యలో విభజనకు వ్యతిరేకంగా పార్టీకి రాజీనామా చేసి సొంతపార్టీ పెట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ పార్టీలోచేరారు. అయితే ఆయన యాక్టివ్‌గా లేరు. 


ఒక్క వర్గాన్నైనా మళ్లీ కాంగ్రెస్ వైపు రప్పించే ప్రయత్నాలు..!


ప్రస్తుతం మళ్లీ పార్టీ పరిస్థితిని  మెరుగుపర్చడంపై రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. అందుకే పీసీసీ చీఫ్‌ను మార్చాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలోనే ఏపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారని చెబుతున్నారు. ఏ పార్టీకతైనా కనీస ఓటు బ్యాంక్ ఉంటేనే విలువ ఉంటుంది. అలాంటి ఓటు బ్యాంక్ కోసం ప్రస్తుతంకాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కు గతంలో మద్దతుగా ఉన్నవర్గాల్లో ఓ వర్గాన్ని అయినా పూర్తిగా తమ వైపు తిప్పుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ఈ కోణంలో ఆలోచించి ఈ సారి మరింత మెరుగైన పీసీసీ చీఫ్‌ను నియమించాలని ఆలోచిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా... ఆ వర్గం వారు జగన్‌ను కాదని కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం లేదు. అందుకే దళిత, మైనార్టీ వర్గాల్లో చురుకుగా వ్యవహరించే నేతలపై రాహుల్ దృష్టి కేంద్రీకరించినట్లుగా చెబుతున్నారు. 


పీసీసీ అధ్యక్షుడ్ని మారిస్తే కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయా..?


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలకు బలం లేకుండా పోయింది. రెండు ప్రాంతీయ పార్టీలే అధికార, ప్రతిపక్షపార్టీలుగా ఉన్నాయి. ఉనికి కోసం జాతీయ పార్టీలు తంటాలు పడుతున్నాయి. అయితే గతమెంతో ఘన చరిత్ర ఉన్నకాంగ్రెస్‌ మాత్రం... తమపాత వర్గాలను ఆకట్టుకుంటే మళ్లీ బలమైన స్థానానికి వస్తామని నమ్ముతోంది. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో కాలమే నిర్ణయించాలి.