కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరి దారుణ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని సోదరుడు నాగేశ్వరరావు (నాని)  అనే ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు ఈ నెల 23 వరకు (14 రోజుల పాటు) రిమాండ్ విధించింది. దీంతో నిందితులను సబ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడైన కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య ను సర్వీస్ నుంచి తొలగిస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 


అసలేం జరిగింది? 



కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కేశవ్‌ (32) ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్నాడు. కేశవ్‌ను ఆదివారం రాత్రి దారణంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నంద్యాల ఎన్జీవో కాలనీలో నివాసిస్తున్న కేశవ్, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో టూటౌన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ వెంకట సుబ్బయ్య, అతడి సోదరుడు నాగేశ్వరరావు కేశవ్ బైక్‌ను ఆపారు. మాట్లాడాలని పక్కకు పిలిచి ఒక్కసారిగా కేశవ్‌పై దాడికి పాల్పడ్డారు. నాగేశ్వరరావు కేశవ్‌ను స్క్రూ డ్రైవర్‌తో 8 సార్లు పొడిచాడు. తీవ్రగాయాలపాలైన కేశవ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.  


మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కేశవ్ భార్య వాణి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. 


వీడియో వైరల్ అవ్వడంతో.. 
ఈ హత్యకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మట్కా మాఫియా అరాచకాలను బయటపెట్టారనే కారణంతో కేశవ్‌ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. 
కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి నంద్యాలలోని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు కారణమైన సుబ్బయ్య, నానిపై హత్య కేసులు నమోదు చేశారు. 


డీజీపీ సీరియస్.. 
జర్నలిస్ట్ కేశవ్ హత్య ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. విలేకరి హత్య కేసును సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీని ఆదేశించారు. కేశవ్ హత్యతో సంబంధం ఉన్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉండగా.. కేశవ్ హత్యపై జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశాయి.


Also Read: IPCC Report Update: విశాఖ మునిగిపోనుందా? అదే జరిగితే ముప్పు తప్పదా?.. నాసా షాకింగ్ రిపోర్ట్!