Raghurama : నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు. దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో సోమవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు.  తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని ధృవీకరించిన ఎంపీ.. నోటీసులకు సమాధానం ఇచ్చానని తెలిపారు. తనకు చాలా రోజుల కిందటే నోటీసులు వచ్చాయని. దీనిపై ఈ నెల 16 వ తేదీనే సమాధానం ఇచ్చానని, మరోసారి విచారణకు హాజరుకావాల్సిన అవసరం తనకు కనిపించలేదన్నారు. హైదరాబాద్‌లో విచారణకు తనతో పాటు రెండు వార్తా చానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిందని..  తనకు ఒక్కడికే నోటీసు ఇవ్వడం కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పారు.


ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు


ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో ఎంపీ రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. రాజద్రోహం.. ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది.  ఆయన పుట్టిన  రోజు నాడు హైదరాబాద్‌లో ఇంట్లో ఉండగా అరెస్ట్ చేశారు.  ఆ తర్వాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజద్రోహం సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 


అమరావతిలో విచారణ వద్దని కోరడంతో హైదరాబాద్‌లో విచారణకు సీఐడీకి హైకోర్టు అనుమతి 


అమరావతిలో విచారణ జరిపితే తన ప్రాణానికి హాని ఉందని.. అందుకే  హైదరాబాద్ లోని తన ఇంట్లో సీఐడీ విచారిస్తే అభ్యంతరాలు లేవన్నారు.  ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎంపీ రఘురామను హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో విచారించాలని సీఐడీని ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఈ తీర్పు జూన్ నెలాఖరులో ఇచ్చింది. తాజాగా విచారణకు సీఐడీ రఘురామకు నోటీసులు జారీ చేసింది. 


విచారణ కోసం దిల్ కుషా గెస్ట్ హౌస్‌కు వచ్చి వెనుదిరిగిన రఘురామకృష్ణరాజు


అయితే రఘురామ విచారణకు హాజరవుతారన్న ఉద్దేశంతో సీఐడీ అధికారుల బృందం ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో తెలంగామకు చెందిన డిప్యూటీ తహసీల్దార్, వైద్యుడు, మరో మధ్యవర్తిని కూడా ఏపీ సీఐడీ పోలీసులు సిద్ధం చేశారు. రఘురామ తరపున కూడా కొంత మంది వచ్చారు. రఘురామకు గుండెకు సంబంధించిన సమస్య ఉండటంతో ఆయన తరపున ఓ వైద్యుడు కూడా వచ్చారు. అయితే చివరికి తాను రావడం లేదని రఘురామ సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. తాను ఎప్పుడో సమాధానం ఇచ్చానని ప్రకటించారు. అయినా సీఐడీ అధికారులు దిల్ కుషా గెస్ట్ హౌస్‌కు రావడం గమనార్హం. 


ఒంగోలు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రిటైర్ - వారసుడికి అవకాశం ! జగన్ హామీ ఇచ్చారా ?