Magunta : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని తన తరపున వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈడీ కూడా తనిఖీలు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆయన మీడియా సమావేశం పెట్టారు. తన బంధువులు ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారు కానీ తనకు సంబంధం లేదన్నారు. ఈడీకి అన్నీ చెప్పామని స్పష్టం చేశారు. తర్వాత తన రాజకీయ ఆలోచన వివరించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు.
రెండు జిల్లాల్లో అనుచరగణం ఉన్న మాగుంట కుటుంబం
మాగుంట కుటుంబం దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా కీలకంగా ఉంటుంది., మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు హత్య చేసిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని మాగుంట పార్వతమ్మ తీసుకున్నారు. అయితే ఆమె త్వరగానే రాజకీయాల నుంచి విరమించుకున్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డే ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన .. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అయితే గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్‌సీపీ రాజకీయాల్లో గ్రూపుల గోల
మాగుంటకు టిక్కెట్ ఇవ్వడానికి సీఎం జగన్ .. తన బాబాయి, సిట్టింగ్ ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డికి మొండి చేయి చూపించాల్సి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో గ్రూపులు బలపడ్డాయి. సీఎం జగన్ బంధువులు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య పొసగడం లేదు. అదే సమయంలో రెండు వర్గాలతోనూ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సరిపడలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని వైవీ సుబ్బారెడ్డి అనుకుంటున్నారు. వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌తో గతంలో ఉన్నంత సాన్నిహిత్యం లేకపోవడంతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కాం కష్టాలు మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇబ్బందికరంగా మారాయి.
మాగుంట కుమారుడికి టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించారా ?
ఈ సారి తనకు బదులు తన కుమారుడు పోటీ చేస్తారని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ.. ఆయన ఫలానా పార్టీ అని చెప్పలేదని కొంత మంది గుర్తు చేస్తున్నాయి. అయితే ఆయన వైఎస్ఆర్‌సీపీ తరపున ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఎంపీగానే పోటీ చేస్తారని.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ వర్గ రాజకీయాలు.. మద్యం వ్యాపారంలో మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇబ్బందులు కలగలిపి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటన సహజంగానే హాట్ టాపిక్ అవుతోంది.
నియోజకవర్గ సమీక్షలు జగన్ ఎందుకు ఆపేశారు ? పార్టీలో సమస్యలు ఎక్కువయ్యాయా ?