Taxes on petroleum high in Andhra Pradesh:
ఆంధ్రప్రదేశ్ లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం పలుమార్తు ఇంధన ధరలను సవరించినప్పటికీ రాష్ట్రం మాత్రం ఎందుకు తగ్గించదని ఆమె ప్రశ్నించారు.
పెట్రోలియం ధరలపై పురంధేశ్వరి పోస్ట్...
ఆంధ్రప్రదేశ్ లో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఎందుకు అలా జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలియం ధరలపై కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పన్ను తగ్గించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ధరల పై మాట్లాడదని నిలదీశారు. ప్రజలకు ఊరట నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ఆమె ప్రశ్నించారు. భారత్ దేశ మ్యాప్ లో ఎ రాష్ట్రంలో పెట్రోలియం ధరలు ఎంత ఉన్నాయని, వెల్లడిస్తూ ఏర్పాటు చేసిన పోస్ట్ ను ఆమె ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు.
కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించింది...
కేంద్ర ప్రభుత్వం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్ల పై రూ.400 తగ్గించిందని దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పన్నులు విధిస్తూ, వసూళ్ళు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అభివృద్ధి ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. పెట్రోలియం ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ గా ఎందుకు ఉన్నాయి అని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా అని అడిగారు. కేంద్రం సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నుల బాదుడులో ఇస్టానుసారంగా వ్యవహరించటం పై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుందని పురంధేశ్వరి అన్నారు.
అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ఉందన్న సర్కార్...
ఇంధన ధరల వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఫాక్ట్ చెక్ లో వివరణ ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు, వాటి ప్రభావం దేశం మీద, మన రాష్ట్రం మీద పడిందన్న విషయం అందరికీ తెలిసిందేనని సర్కార్ వెల్లడించింది. పెట్రోలు, డీజిలు ధరలు అధికంగా ఈ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నట్టుగా ప్రచారం జరగటం సరికాదని , పెట్రోలు, డీజిలు ధరల పై అదనంగా వ్యాట్ ను మోపింది గతంలో ఉన్న తెలుగుదేశం సర్కార్ అని వెల్లడించింది. 2015, ఫిబ్రవరికి ముందు పెట్రోలు పై 31శాతం వ్యాట్, డీజిలు పై 22.5 శాతం వ్యాట్ ఉండేదని, గత ప్రభుత్వం ఈ రేట్లను పూర్తిగా మార్చి, పెంచిందని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. అప్పుడున్న రేట్లకు అదనంగా పెట్రోలుపై లీటరకు రూ.4లు చొప్పున, డీజిలు పై లీటరుకు రూ.4లు చొప్పున ధరలు పెంచింది గత ప్రభుత్వమే అని వెల్లడించారు.
వైఎస్ఆర్ సీపీ అదికారంలోకి వచ్చాక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, అయితే కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఏడాదికి రూ.30వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చిందని, మరో వైపు గత ప్రభుత్వం క్రమం తప్పకుండా చేయాల్సిన రోడ్ల మరమ్మతులను గాలికి వదిలేయడంతో పాటు, ఈ నాలుగు సీజన్ల పాటు కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ తీవ్రంగా పాడయ్యాయని, ఒకేసారి అన్ని రోడ్లూ మరమ్మతులు చేయాల్సి వచ్చిందని ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రూపాయిని లీటరు పెట్రోలు, డీజీలుపై పెంచిందని స్పష్టం చేశారు.