Congress News : తెలంగాణలో విజయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీ నేతలు మొత్తం హైదరాబాద్ కు తరలి వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.  పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగనుంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరపాలని నిర్ణయించింది. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే కానుంది. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని భావిస్తోంది.  దీనికి అధిష్ఠానం ఒప్పుకుంది. 


కాంగ్రెస్ మఖ్యనేతలంతా హైదరాబాద్ రాక 


సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్‌ కమిటీ సభ్యులు ఈ సమావేశం కోసం రాష్ట్రానికి రానున్నారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ రానుంది.  సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు సెప్టెంబరు 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సైరన్ మోగించనుంది. 


18వ తేదీన బీఆర్ఎస్ సర్కార్ పై చార్జిషీట్


పదహారో తేదీన సిడబ్ల్యూసీ ప్రతినిధుల సమావేశం  జరుగుతుందని కాంగ్రెస్ నేత కేసీ వేముగోపాల్ ప్రకటించారు. పదిహేడో తేదీన  సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేతలు సమావేశం అవుతారు.  17వ తేదీన మెగా ర్యాలీలో చేపడతామన్నారు. ఈ ర్యాలీలో ఐదు డిక్లరేషన్లను ప్రకటించనున్నారు. పద్దెనిమిదో తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జిషీటు విడుదల చేస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. అభ్యర్థుల జాబితాను కూడా అప్పటికల్లా ఖరారు చేసే అవకాశం ఉంది. 


బస్సు యాత్రకూ సన్నాహాలు చేసుకుంటున్న టీ కాంగ్రెస్                             


మొత్తం 100 మందికి పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్య నేతలు తెలంగాణవ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టింది. ఈ నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలంతా పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. 


సీడబ్ల్యూసీ భేటీ తర్వాత  అభ్యర్థుల ప్రకటన


సీడబ్ల్యూసీ భేటీ తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో  అభ్యర్థుల ఎంపిక కసరత్తు నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి.  లిస్ట్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత .. హైకమాండ్ ఆమోదంతో తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది.