Minister RK Roja : ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు మండిపడ్డుతున్నారు. అయితే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి సముచిత గౌరవం ఇచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ నేమ్ పాలిటిక్స్ లో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై మళ్లీ సంచలన  వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు తీరుపై రోజా విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ బతికుండగా ఆయనను పట్టించుకోని కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఏదో జరిగినట్లు హడావుడి చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కు అప్పుడే అన్నం పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించినప్పుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుని మెడపెట్టి బయటకు గెంటేసి ఉంటే బాగుండేదన్నారు. అప్పుడు అలా చేసి ఉంటే ఎన్టీఆర్ ప్రధానమంత్రి స్థాయిలో ఉండేవారంటూ మంత్రి రోజా అన్నారు. బతికుండగానే ఎన్టీఆర్ ను చంపేసిన చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ పై మాట్లాడే అర్హత లేదని మంత్రి రోజా అన్నారు. 


రైతులు ఐఫోన్ వాచ్ పెట్టుకుంటారా?


అమరావతి రైతులు రాజధాని విషయంలో కోర్టులో గెలిచామని సంబరపడుతున్నారని, మూడు రాజధానులు ఏర్పాటు కచ్చితమని మంత్రి రోజా మరోసారి చెప్పారు. త్వరలో  విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందన్నారు. ఆ నిజాన్ని గుర్తించక రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి అమరావతి రైతులు పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. రైతులు వాకీటాకీలు, ఐఫోన్ వాచ్ లు పెట్టుకొని తొడలు కొడతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారని ఎద్దేవా చేశారు. జంబలకడిపంబ తరహా పార్టీ అంటూ విమర్శించారు.  29 గ్రామాల కోసం 26 జిల్లాల అభివృద్ధిని అడ్డుకోవాలని సీఎం  జగన్ అనుకోరన్నారు. ఏపీలో ప్రతి నియోజకవర్గం రాజధానితో సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామన్నారు.  రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.  ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 






Also Read : Dadisetti Raja On NTR : ఎన్టీఆర్ చేతగాని వ్యక్తి, అందుకే రెండుసార్లు వెన్నుపోటు - మంత్రి దాడిశెట్టి రాజా


Also Read : Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు