Stock Market Closing Bell 26 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మరొక బ్లాక్‌ మండేని చూశాయి. గ్లోబల్‌ మార్కెట్లతో డీ-కప్లింగ్‌ అవుతున్నాం అని చంకలు గుద్దుకుంటున్న నేపథ్యంలోనే దారుణ పరాభవం జరిగింది. ఇవాళ (సోమవారం) బిగ్‌ గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమైన మార్కెట్లు, ప్రారంభం నుంచి కొద్దిగానైనా కోలుకోవాలని ప్రయత్నించాయి. మిడ్‌ సెషన్‌ వరకు కాస్త పర్లేదు అనిపించినా, యూరోప్‌ మార్కెట్ల మొదలయ్యాక మళ్లీ మొదటికే వచ్చాయి. చకచకా పడడం మొదలు పెట్టాయి. చివరి గంటలో భారీ సెల్లాఫ్‌ కనిపించింది. కీలకమైన 17,000 మార్క్‌ దగ్గర నిఫ్టీ ఆగింది. దీనిని, ట్రెండ్‌ను సెట్‌ చేసే మార్క్‌గా మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


రూపాయి పతనం కూడా కొనసాగి, మళ్లీ జీవితకాల కనిష్టానికి దిగజారింది. ఇవాళ్టి ట్రేడ్‌లో, డాలర్‌తో పోలిస్తే 81.66 కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి, చివరకు 63 పైసల నష్టంతో 81.62 దగ్గర క్లోజయింది. ప్రీవియస్‌ క్లోజ్‌ 80.99.


BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,098.92 పాయింట్ల  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ (సోమవారం) 574 పాయింట్లు లేదా 0.99 శాతం నష్టంతో 57,525.03 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 57,038.24 పాయింట్ల దగ్గర ఇంట్రా డే కనిష్టాన్ని, 57,708.38 పాయింట్ల దగ్గర ఇంట్రా డే గరిష్టాన్ని టచ్‌ చేసింది. చివరకు 1.64 శాతం లేదా 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద ముగిసింది.


NSE Nifty
శుక్రవారం 17,327.35 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 171 పాయింట్లు లేదా 0.99 శాతం నష్టంతో 17,156.30 పాయింట్ల వద్ద ఓపెనైంది. 16,978.30 పాయింట్ల దగ్గర ఇంట్రా డే కనిష్టాన్ని, 17,196.40 పాయింట్ల దగ్గర ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. రోజు ముగిసేసరికి 1.80 శాతం లేదా 311.05 పాయింట్ల నష్టంతో 17,016.30 వద్ద ముగిసింది. శాతాల ప్రకారం చూస్తే, సెన్సెక్స్‌ కంటే నిఫ్టీ ఎక్కువగా నష్టపోయింది.


Nifty Bank
శుక్రవారం 39,546.25 పాయిట్ల వద్ద ముగిసిన బ్యాంక్‌ నిఫ్టీ, ఇవాళ 518 పాయింట్లు లేదా 1.31 శాతం నష్టంతో 39,027.85 పాయింట్ల వద్ద మొదలైంది. 38,492.20 పాయింట్ల దగ్గర ఇంట్రా డే కనిష్టాన్ని, 39,229.40 పాయింట్ల దగ్గర ఇంట్రా డే గరిష్టాన్ని టచ్‌ చేసింది. చివరకు 2.35 శాతం లేదా 930.00 పాయింట్ల నష్టంతో 38,616.25 వద్ద ముగిసింది.


Top Gainers and Lossers
నిఫ్టీ50లో కేవలం 9 కంపెనీలు లాభపడగా, మిగిలిన 41 కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫీ, ఏసియన్‌ పెయింట్స్‌, దివీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌ 0.60-1.36 శాతం వరకు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, హిందాల్కో, మారుతి, ఐషర్‌ మోటార్స్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ 4-6.35 శాతం వరకు నష్టపోయాయి. ఒక్క నిఫ్టీ ఐటీ (0.57  శాతం లాభం) తప్ప మిగిలిన సెక్టోరియల్‌ ఇండీస్‌ అన్నీ రెడ్‌లోనే ఎండ్‌ అయ్యాయి.


ఈ నెల 28, 29, 30 తేదీల్లో (బుధ, గురు, శుక్రవారాల్లో) జరిగే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) పరపతి విధాన సమీక్షలో (MPC) తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. MPC నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. వడ్డీ రేట్లను RBI ఎన్ని బేసిస్‌ పాయింట్లు పెంచుతుంది, దేశంలో ద్రవ్యోల్బణం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపు గురించి ఎలాంటి సిగ్నల్స్‌ ఇస్తుంది అన్నదానిపై ఈ వారంలో మన మార్కెట్ల కదలికలు ఆధారపడి ఉంటాయి. RBI తన వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతుందని ప్రస్తుతం మార్కెట్‌ ఆశిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.