Posani Krishnamurali: ఆంధ్రప్రదేశ్ మాజీ ఫిల్మ్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత.. దూకుడుగా మాట్లాడే లీడర్, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఇక తన పూర్తి సమయం కుటుంబానికి కేటాయిస్తానని బతికున్నంత కాలం రాజకీయాల గురించి మాట్లాడబోనన్నారు. ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదన్నారు. ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను.. నన్ను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడనని చెప్పుకొచ్చారు. ఓటర్ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానన్నారు. నా కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు.
Also Read: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదని.. తాను మగవాడ్నని చెప్పుకొచ్చారు. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని నన్ను కూడా తిడుతున్నారని చెప్పుకొొచ్చారు. అయినా తాను పట్టించుకోననన్నారు. అందరికీ కంటే ఎక్కువగా తనను చంద్రబాబు పొగిడారని.. శ్రావణ మాసం సినిమా రిబ్బన్ కటింగ్ రోజున 100 అడుగుల కటౌట్ పెట్టానని చెప్పుకున్నారు. పోసాని కృష్ణమురళి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏపీలో ఆయనపై నమోదవుతున్న కేసులేనని భావిస్తున్నారు. వైసీపీ నేతగా ఆయన ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్, లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. గతంలో కోర్టు ఆదేశాలతో భీమవరంలో కేసులు నమోదయ్యాయి.
ఇటీవల అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సైకోలుగా ప్రవర్తిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. అలా పెట్టడం ప్రారంభించిన తర్వాత కూడా పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ తో పాటు చంద్రబాబు, పవన్,లోకేష్‌లపై ఘాటు భాషతో విమర్శలు గుప్పించారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆయనపై ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పోసాని కృష్ణమురళి తాను రాజకీయాలు మాట్లాడబోనని ప్రకటించారు. ఇక ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అంటున్నారు.
అయితే ఆయన ఇలా ప్రకటించినంత మాత్రాన ఏపీలో ఆయనపై నమోదైన కేసుల నుంచి విముక్తి లభిస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలో ఆయన మాట్లాడిన మాటలుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నారా లోకేష్ మంగళగిరి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.