Kavita Kalvakuntla made important comments on Prime Minister Narendra Modi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు నుంచి విడుదలైన తర్వాత కల్వకుంట్ల కవిత సైలెంట్ గా ఉన్నారు. హఠాత్తుగా ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా ? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించడంతో అక్కడ తీహార్ జైల్లో కల్వకుంట్ల కవిత ఆరు నెలల పాటు ఉండాల్సి వచ్చింది.గత ఆగస్టులో బెయిల్ రావడంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. అప్పట్నుంచి కోర్టు విచారణకు ఆన్ లైన్ లో హాజరు అవుతున్నారు. బెయిల్ పై విడుదలైనప్పటి నుండి పూర్తిగా రాజకీయాల విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలలోనూ పాల్గొనడం లేదు.అయితే హఠాత్తుగా అదానీ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రధాని మోదీనే ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Also Read: అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
భారత్‌లో విద్యుత్ ఒప్పందాల విషయంలో అదానీ పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చిందని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో కేసు నమోదు అయింది. అమెరికా నుంచి తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇలా చేశారని కోర్టులో కేసు నమోదు అయింది. ఈ అంశం సంచలనం సృష్టించింది. అందుకే కవిత కూడా స్పందించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అదానీని అరెస్టు చేసిస విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత కూడా అదానీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నట్లుగా ట్వీట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
గౌతమ్ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
అయితే అదానీ గ్రూపు అమెరికా కోర్టులో దాఖలైన కేసుపై స్పందించింది. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆరోపణలన్నీ నిరాధారం వాటిని తిరస్కరిస్తున్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. "నిరూపణ అయ్యే వరకూ నేరారోపణలు చేసిన వ్యక్తి నేరస్తుడు కాదని, స్వచ్చమైన వ్యక్తేనని" అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతున్న విషయాన్ని అదానీ గ్రూప్ గుర్తు చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా చేపట్టాల్సిన చర్యలను తీసుకుంటామని అదానీ గ్రూపు తెలిపింది.