Ponnavolu Sudhakar Reddy on YS Sharmila Comments: గుంటూరు జిల్లా సభలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. జగన్ అక్రమాస్తుల కేసుల ఎఫ్ఐఆర్ లో వైఎస్ఆర్ పేరును చేర్చినందుకు గానూ సీఎం.. ఆయనకు ఏఏజీ పదవి ఇచ్చారన్న షర్మిల వ్యాఖ్యలపై పొన్నవోలు స్పందించారు. వైఎస్ షర్మిల అలవోకగా అబద్ధం ఆడారని.. తమ రాజకీయ లబ్ధి కోసం తనను వాడుకోవద్దని పొన్నవోలు కోరారు. ఈ సందర్భంగా ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
‘‘నేను ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హోదాలో రాలేదు, నేను ఒక మాములుగా మనిషిగా మీడియాతో మాట్లాడుతున్నా. నా మీద నిజం లేని ఆరోపణలు షర్మిల చేశారు. ఆమె రాజకీయ లబ్ధికోసం అలా మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ అడ్వకేట్ గా మాట్లాడటం లేదు..గతంలో ప్రవేట్ లాయర్ గా పనిచేసిన నా వర్క్ మీద ఆరోపణలు షర్మిల చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ చేర్చింది నేనే అంటున్నారు. షర్మిల మాటల్లో వాస్తవం లేదు. చనిపోయిన వ్యకిని షర్మిల మలినం చేస్తున్నారు. అన్న జగన్ పరువు తీస్తున్నారు షర్మిల.
2010 లో కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు హైకోర్టుకి ఓ లెటర్ రాశారు. 2015 లో మరొకసారి లెటర్ రాశారు. ఆ శంకరరావు వల్లే అప్పుడు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దీనిపై హైకోర్టు విచారణకు కూడా ఆదేశించింది. టీడీపీ నేతలు ఎర్రనాయుడు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. వైఎస్ఆర్ ను ఆనాడే ముద్దాయిని చేశారు’’
అప్పుడు నేను ప్రవేటు కేసు మాత్రమే వేశాను. జగన్ కేసులో వైఎస్ పేరు చేర్చడం అన్యాయం అని నేను మాట్లాడాను. అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తుంటే అన్యాయమని అనుకుని.. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని వైఎస్ షర్మిల మాట్లాడితే బావుంటుంది’’
‘‘షర్మిల రాజకీయ భవిష్యత్తు కోసం నన్ను బలి చేస్తున్నారు. వైఎస్ఆర్, జగన్ ఎవరో కూడా నాకు తెలియనప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని నేను వ్యక్తిగతంగా ప్రైవేటు కేసు వేశాను. షర్మిల చెప్పింది నిజమే అని నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా సిద్ధం. షర్మిల అబద్దాలు చెప్పి నా వృత్తి మీద దెబ్బ కొట్టారు. వైఎస్ఆర్ ని వేధించిన వారితో నేను పోరాడాను. అలాంటిది నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ మధ్య నా టాలెంట్ షర్మిలకి తెలియడం లేదా..? నా పోస్ట్ టాలెంట్ తో వచ్చింది కానీ జగన్ వలన రాలేదు. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధంలోకి నన్ను లాగడమేంటి? నిన్న షర్మిల మాట్లాడిన మాటలే చంద్రబాబు మాట్లాడాడు. ఇద్దరు ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు’’ అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడారు.