Warangal Maid Theft: ప్రియుడు.. అక్కతో కలిసి యజమాని ఇంటికి కన్నం వేసిన పని మనిషి ఉదంతం తాజాగా వెలుగు చూసింది. ఆమె పని చేస్తున్న యజమాని ఇంట్లోనే పని మనిషి కళ్యాణి చోరీకి పాల్పడిందని.. ఆమెకు ప్రియుడు చంటి, అక్క సునీత సహకరించారని వరంగల్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. పని మనిషి సహా ఆమె ప్రియుడు, అక్క నుంచి రూ.38 లక్షల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం బిల్యానాయక్ తండాకు చెందిన కళ్యాణి హనుమకొండ లోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటున్న డాక్టర్ కీసర విక్రమ్ రెడ్డి ఇంట్లో కొంత కాలంగా పని మనిషిగా పని చేస్తుంది. ఇదే సమయంలో నిందితురాలు తన యజమాని ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను ఉన్నట్లుగా గుర్తించింది. కళ్యాణికి యజమాని ఇంట్లోని బంగారం పై ఆశ కలిగింది. ఎలాగైనా బంగారాన్ని దొంగిలించాలని ప్రియుడు చంటి, కళ్యాణి అక్క సునితతో కలిసి ప్లాన్ ప్రకారం యజమాని కళ్లు కప్పి 650 గ్రాముల బంగారు అభారణాలను నాలుగు దఫాలుగా చోరీ చేసినట్లుగా వరంగల్ కమిషనర్ తెలిపారు. ఇంట్లో బంగారం మాయం అవుతుండడంతో యజమాని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పని మనిషిపై అనుమానంతో ఆమెను విచారణ చేయగా.. చోరికి పాల్పడినట్లు తేలిందని సీపీ చెప్పారు. ఈ చోరీ మార్చి నెలలో జరిగిందని అన్నారు. దొంగిలించిన బంగారు అభరణాల్లో కొంత భాగం బంగారాన్ని తాకట్టులో పెట్టి కారు కొన్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా మీడియాకు చెప్పారు.