" దిశా చట్టం"  ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిస్టీరియస్ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం అమలుపై విరివిగా సమీక్షలు చేస్తూంటారు. హోంమంత్రి లాంటి వాళ్లు ఆ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామంటారు. ముగ్గురికి ఉరి వేశామని నిర్మోహమాటంగా చెబుతూంటారు. డీజీపీ వంటి వాళ్లు దిశ చట్టం పకడ‌్బందీగా అమలవుతోందంటారు. ఇక కింది స్థాయి  పోలీసుల గురించి చెప్పాల్సిన పని లేదు. దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అసువుగా చెబుతూంటారు.  దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. దిశ పేరుతో యాప్ కూడా నడుస్తోంది. పైకి మొత్తం "దిశ" మయం. కానీ నిజంగా ఆ చట్టం ఉందా..? ఆ చట్టం పరిస్థితి ఏమిటి..? రాష్ట్రపతి సంతకానికి ఎంత దూరంలో ఉంది..?




"దిశ" చట్టం ప్రకారం ఉరి శిక్షలు కూడా వేశామని చెబుతున్న హోంమంత్రి సుచరిత..! 


స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుంటూరు నడిబొడ్డున ఓ యువతిని ప్రేమోన్మాది శశికృష్ణ పొడిచి చంపేశాడు. ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న దిశ చట్టం కింద అతన్ని శిక్షించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇరవై ఒక్క రోజుల్లో నిందితుడికి శిక్ష విధించాలని టీడీపీ నేత లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.  ఈ అంశంపై సోషల్ మీడియాలో ఉద్ధృతంగా ప్రచారం చేయడమే కాదు.. నిరసనలు కూడా చేపడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ పెద్దలు అందరూ దిశ చట్టం అమలవుతోందన్న భావన ప్రజల్లో కల్పించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి సుచరిత దిశ చట్టం కింద కేసులు పెడుతున్నామని కూడా చెబుతున్నారు. సీఎం జగన్ తరచూ సమీక్షలు చేస్తూంటారు. దిశ చట్టం ఎంత పక్కాగా అమలు చేస్తున్నామో అధికారులు ఆయనకు వివరిస్తూ ఉంటారు.


అదే చట్టం ప్రకారం రమ్య నిందితుడికి ఉరి శిక్ష వేయాలని టీడీపీ డెడ్‌లైన్..! 


ప్రభుత్వం దిశా చట్టం గురించి అదే పనిగా ప్రచారం చేయడం.. దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఆ చట్టం ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ప్రకటనలు చేయడం విపక్ష పార్టీల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో  దిశ చట్టం అమలవుతూంటే ఆ చట్టం ప్రకారం ఇరవై ఒక్క రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు డెడ్‌లైన్‌ కూడా పెట్టింది. 21 రోజుల్లోపు శిక్ష విధించాలని ప్రతీ రోజూ కౌంట్ డౌన్ వినిపిస్తోంది. దిశ చట్టం అంతా ఫార్సు అని చెప్పాలని టీడీపీ 21 రోజుల డెడ్ లైన్ పెట్టిందని సులువుగా అంచనా వేయవచ్చు. ప్రస్తుతం టీడీపీ పెట్టిన డెడ్‌లైన్‌పై ఏపీలో చర్చ జరుగుతోంది.


హైదరాబాద్ దిశ ఘటనతో చలించి ఏపీలో బిల్లు తీసుకొచ్చిన సీఎం జగన్..!  


2019  డిసెంబర్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో హైదరాబాద్ శివారులో కొంత మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి ఓ యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి.. చంపేసి కాల్చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితుల్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎన్‌కౌంటర్ చేశారు. దిశ అనే అమ్మాయి అలా బలైపోవడం అందర్నీ కలవరపరిచింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను మరింత కలవరపరిచింది. తను సీఎంగా ఉన్న రాష్ట్రంలో అలాంటివి జరగకూడదని అప్పటికప్పుడు దిశ చట్టం ఆలోచన చేశారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టేశారు. ఆ చతట్టం ప్రకారం  మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే వారిపై మొదటి వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్‌, మూడో వారంలో శిక్ష వేస్తారు.  "ఏపీ దిశ చట్టం"గా నామకరణం చేసి..ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి అసెంబ్లీలో డిసెంబర్ 13 , 2019న ఆమోదం తెలియచేశారు.  దిశ చట్టం ప్రకారం 13 జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక కోర్టు పరిధిలో యాసిడ్‌ దాడులు, అత్యాచారం కేసులు విచారిస్తారు. సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ చట్టం అసెంబ్లీలో ఆమోదించినప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలతో కూడిన ఓ లేఖను జగన్‌కు పంపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా... దిశ చట్టంపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు.  


బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని తిప్పి పంపిన కేంద్రం..! 


కానీ ఎవరు ప్రశంసించినా అసెంబ్లీ ఆమోదించిన బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదముద్రపడాలి. అలా పడాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. హుటాహుటిన బిల్లు ఆమోదించేసి ఢిల్లీకి పంపిన ఏపీ సర్కార్ ఆ బిల్లును కేంద్రం ఆమోదిస్తుందని రాష్ట్రపతి సంతకం కోసం పంపుతుందని ఎదురు చూస్తూనే ఉంది. మొదటి సారి ఆ  బిల్లు పంపినప్పుడు  కేంద్రం ఇప్పుడు ఆ చట్టాన్ని.. వివిధ మంత్రిత్వ శాఖలకు పంపింది. కేంద్ర, న్యాయ, శాసన వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖ పరిధిలోని మహిళా విభాగాలకు బిల్లు వెళ్లింది. అక్కడే చాలా కాలం ఆగిపోయింది. ఈ సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం అమలు గురించి సమీక్షలు ప్రారంభించారు. దిశ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించారు. కానీ కేంద్రం 2010 అక్టోబర్‌ వరకూ బిల్లు తన దగ్గరే ఉంచుకుని చట్టంగా చేయడం రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించడం సాధ్యం కాదని వెనక్కి పంపేసింది. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని అనేక మార్పులు చేయాలని సూచించింది.  ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లను... సవరిస్తున్నట్లుగా దిశ చట్టంలో  పేర్కొన్నారు. ఓ కేంద్ర చట్టాన్ని... కేంద్ర పరిధిలో ఉండే.. ఐపీసీ, సీఆర్పీసీని.. ఓ రాష్ట్రం మార్చడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది.


చట్టం అనే పేరు సహా శిక్షలు, సెక్షన్లు లేకుండా బిల్లును మళ్లీ పంపినా పట్టించుకోని కేంద్రం..! 


కేంద్రం బిల్లు వెనక్కి పంపడం అప్పటికి దిశ చట్టం పేరుతో ఎంతో హడావుడి చేసి ఉండటంతో మళ్లీ సవరణలు చేసి కేంద్రానికి పంపాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. మళ్లీ గత ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీలో సంపూర్ణంగా పాత దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని కొత్త బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టారు. ఆ బిల్లులో శిక్షలు లేవు.  గడువు లేదు. ఆ చట్టం కింద ప్రత్యేకంగా కేసులు పెట్టడం కూడా సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే.. అది అసలు చట్టమే కాదు. కొత్త బిల్లులో చట్టం అనే పదం కూడా తీసేశారు. ఉపసంహరించుకున్న దిశ బిల్లు.. ఇప్పుడు రెండో సారి పెట్టిన దిశ  బిల్లుకు అసలు పొంతన లేదు. ఒక్క దిశ పేరు మాత్రమే ఉంది. ఈచట్టం వల్ల ప్రత్యేక కోర్టులు మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉపసంహరించుకున్న బిల్లులో 14 రోజుల్లో కోర్టుల్లో విచారణ.. 21 రోజుల్లో శిక్ష ఖరారు అని ఉంది. అలాగే వివిధ చట్టాల్లోని సెక్షన్లను మార్చారు. కొత్త చట్టంలో .. నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం, ఐపీసీ-1860, సీపీసీ-1973ల పరిధిలోనే కేసుల నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత న్యాయమూర్తుల నియామకానికి వారికి సౌకర్యాల గురించి ప్రస్తావించారు. ఎక్కడా చట్టాల గురించి ప్రస్తావించలేదు. ఆ బిల్లును ఆమోదించి కేంద్రానికి గత డిసెంబర్‌లో పంపారు. కానీ ఇంత వరకూ ఆమోదం లభించలేదు.


ఇప్పటికీ దిశా చట్టానికి రాష్ట్రపతి సంతకం కాలేదు..!


మార్పు చేర్పులు చేసి పంపినా కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదో తెలియదు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడల్లా దిశ చట్టాన్ని కేంద్రంతో ఆమోదింప చేసుకు రావాలని ఎంపీలకు జగన్ చెబుతూంటారు. కానీ ఆ చట్టం విషయంలో అడుగు కూడా మందుకు పడదు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఇటీవల లోక్‌సభలో దిశ చట్టం గురించి లోక్‌సభలోనే కేంద్రాన్ని ప్రశ్నించారు.  దానికి కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా లిఖిత పూర్వకంగా సమాధానం పంపారు.  దాని ప్రకారం.. దిశ చట్టంపై కేంద్రానికి వచ్చిన అభ్యంతరాలు.. అనుమానాలను నివృతి చేయామని ఏపీ సర్కార్‌కు తిరిగి పంపామని.. కానీ ఆ బిల్లు ఇంకా తమకు తిరిగి రాలేదని సమాధానంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం వద్దనే ఉందని చెబుతూ ఉంటుంది. అసలు ఆ చట్టంలో కేంద్రానికి ఉన్న అభ్యంతరాలేమిటి..? అసలుఎందుకు పెండింగ్లో పెట్టారు..?  ఏ అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు..? ఎవరికీ తెలియదు. అదొక మిస్టరీ దిశ. 


ఉన్న చట్టాల్ని వదిలేసి లేని చట్టాలపై ఆర్భాటమెందుకు..? 


అసలు విషయం ఇలా ఉంటే..  ప్రభుత్వం చేసుకుంటున్న పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉంటుంది. దిశ చట్టం అమల్లో ఉందని నమ్మించడానికి అందరూ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంటారు.  ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి వరకూ అందరూ దిశ చట్టం ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ ఉంటారు. అక్కడే ప్రజల్లో సందేహాలు ప్రారంభమవుతున్నాయి. నిజానికి మహిళలపై వేధింపులకు పోక్సో సహా ఎన్నో కఠినమైన చట్టాలున్నాయి. వాటిని సమర్థంగా అమలు చేస్తే నేరస్తులకు భయం కలుగుతుంది. కానీ ఉన్న చట్టాలను సమర్థంగా అమలు చేయలేని వ్యవస్థ.. లేని చట్టాన్ని మాత్రం ఉందని మభ్య పెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించడమే విషాదం.