కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తులను మానిటైజ్ చేసి.. అంటే ప్రైవేటుకు అప్పగించి రూ. ఆరు లక్షల కోట్లు సమీకరించబోతున్నట్లుగా ప్రకటించారు.  కేంద్రానికి ప్రత్యేకంగా ఆస్తులు ఎక్కడో ఉండవు. రాష్ట్రాల్లోనే ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న  రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమాశ్రయాల్లో కీలకమైన వాటిని ప్రైవేటుకు అప్పగించే జాబితాలో చేర్చారు. 
 
తెలంగాణలో కీలక రహదారులన్నీ మానిటైజ్..!


తెలంగాణలో కీలకమైన రోడ్లను మానిటైజేషన్ జాబితాలో చేర్చారు.  కడ్తాల్‌ - ఆర్మూర్‌ మధ్య  31 కి.మీ రోడ్, కడ్లూరు ఎల్లారెడ్డి -చేగుంట మధ్య నిర్మించిన  52 కి.మీ రోడ్, చేగుంట -  బోయినిపల్లి మధ్య నిర్మించిన 62 కి.మీ. రహదారి, మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన ఏడో నెంబర్ జాతీయ రహదారి 55 కి.మీ, ఆర్మూర్‌ - కడ్లూరు ఎల్లారెడ్డి మధ్య నిర్మించి 59 కి.మీ, కడ్లూరు ఎల్లారెడ్డి -  గుండ్ల పోచంపల్లి మధ్య నిర్మించిన  86 కి.మీల రహదారి, హైదరాబాద్‌ - బెంగళూరు  మార్గంలో తెలంగాణలో నిర్మించిన 75 కి.మీల హైవేని మానిటైజ్ పేరుతో ప్రైవేటుకు ఇవ్వబోతున్నారు. అంటే ఈ రోడ్లను కొనుక్కున్నా లేదా గుత్తకు తీసుకునే సంస్థలు వాటిపై ప్రయాణించే వారి నుంచి చార్జీలు వసూలు చేస్తాయన్నమాట.  తెలంగాణలోని రైల్వేలను కూడా మానిటైజ్ పేరుతో ప్రైవేటుకు అప్పగించబోతున్నారు. సికింద్రాబాద్‌ క్లస్టర్‌ బిడ్డింగ్‌ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.  


ఏపీలో ఎయిర్‌పోర్టులూ ప్రైవేటు చేతికి..!


ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రాజెక్టులు తక్కువే కానీ దాదాపుగా అన్నీ ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. కొత్తకోట బైపాస్‌ -  కర్నూలు, ఏపీ మీదుగా వెళ్లే హైదరాబాద్‌ -  బెంగళూరు హైవే, చిలకలూరిపేట- విజయవాడ రహదారుల్ని ప్రైవేటుకు అప్పగిస్తారు. ఇక కృష్ణా గోదావరి బేసిన్  పైప్ లైన్ నెట్‌వర్క్ 889 కి.మీ. పొడవు ఉంటుంది. దీన్ని కూడా ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారు. విజయవాడ, తిరుపతి,రాజమండ్రి విమానాశ్రయాలను అమ్మకాల జాబితాలో చేర్చింది కేంద్రం. రూ. 990 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ ఎయిర్‌పోర్టు జోలికి మాత్రం రాలేదు. దానికి కారణం ఆ ఎయిర్‌పోర్టు భద్రతా బలగాల అధీనంలో ఉంటుంది. పోర్టుల్లో కూడా ప్రాజెక్టులనుకూడా ప్రైవేటుకు అప్పగిస్తారు. విశాఖ పోర్టులో నాలుగు ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి రూ. 988 కోట్ల మేర మానిటైజ్ చేయబోతున్నారు.  ఇక రైల్వే స్టేషన్లలలో తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల మానిటైజేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.


ప్రజలకు ఇక సేవలు భారమే.. !


అమ్మడం అంటే తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో మానిటైజేషన్ అనే పేరును కేంద్రం చేపట్టింది. యాజమాన్యహక్కులు కేంద్రానికే ఉంటాయని కానీ నిర్వహణ మాత్రమే ప్రైవేటుకు అని కేంద్రం చెబుతోంది. ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన ఆస్తులన్నీ ప్రైవేటు పరం కాబోతున్నాయనేది మాత్రం నిజం. ఈ ప్రకారం.. ఆయా ప్రాజెక్టుల్లో ప్రజలకు సేవలు అందాలంటే ఖచ్చితంగా రుసుములు కట్టాల్సి ఉంటుంది.